Share News

సిబ్బంది ఉండరు.. సాగునీరు అందదు

ABN , Publish Date - May 26 , 2026 | 11:44 PM

Uncompleted Narayanapuram modernization works నీటిపారుదల శాఖను సిబ్బంది కొరత వెంటాడుతోంది. మూడు మండలాల పరిధిలో వేలాది ఎకరాలకు సాగు నీరందించే నారాయణపురం ప్రాజెక్టు (కింతలి సెక్షన్‌)లో పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ఇక్కడ 16 మందికిగాను ముగ్గురితోనే నెట్టుకొస్తున్నారు.

సిబ్బంది ఉండరు.. సాగునీరు అందదు
నారాయణపురం ఆనకట్ట వద్ద ప్రస్తుత పరిస్థితి

  • నారాయణపురం ప్రాజెక్టు పరిధిలో.. ముగ్గురితోనే విధులు

  • కొరవడుతున్న అధికారుల పర్యవేక్షణ

  • పూర్తికాని ఆధునికీకరణ పనులు

  • ఏటా రైతులకు తప్పని ఇబ్బందులు

  • ఎచ్చెర్ల, మే 26(ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖను సిబ్బంది కొరత వెంటాడుతోంది. మూడు మండలాల పరిధిలో వేలాది ఎకరాలకు సాగు నీరందించే నారాయణపురం ప్రాజెక్టు (కింతలి సెక్షన్‌)లో పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ఇక్కడ 16 మందికిగాను ముగ్గురితోనే నెట్టుకొస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక.. ఆధునికీకరణ పనులు సాగక.. కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా పంట పొలాలకు సక్రమంగా సాగునీరందని దుస్థితి నెలకొంది. ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తున్న నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

  • నారాయణపురం ప్రాజెక్టు ద్వారా ఎచ్చెర్ల, పొందూరు, సంతకవిటి మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీరందేది. కుడికాలువ 50.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ కాలువ ద్వారా మూడు మండలాల్లో 18,600 ఎకరాలకు సాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. కాగా నీటిపారుదలశాఖలో సిబ్బంది కొరత కారణంగా దీని నిర్వహణ, పర్యవేక్షణ కొరవడుతోంది. సాగునీటి పంపిణీని సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఒక సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఈఈ), ముగ్గురు ఇరిగేషన్‌ అసిస్టెంట్లు, ముగ్గురు వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, తొమ్మిది మంది లస్కర్లు అవసరం. కానీ ప్రస్తుతం కింతలి సెక్షన్‌లో ఏఈఈతోపాటు ఇద్దరు ఇరిగేషన్‌ అసిస్టెంట్లు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో హెడ్‌ నుంచి టెయిల్‌ ఎండ్‌ వరకు సాగునీటిని అందించడం కష్టసాఽధ్యంగా మారింది.

  • కానరాని సొంత భవనం

  • ఎచ్చెర్ల మండలం కుశాలపురంలో కింతలి సెక్షన్‌ ఇరిగేషన్‌ కార్యాలయం ఉండేది. శిథిలావస్థకు చేరుకోవడంతో పదేళ్ల కిందటే ఈ భవనాన్ని తొలగించారు. దీని స్థానంలో రూ.9.8 లక్షల అంచనా వ్యయంతో నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కాగా ఈ భవనం పక్కనుంచి 13 అడుగుల రహదారి ఏర్పాటు చేయాలంటూ స్థానిక రైతులు కోరారు. దీంతో భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇక్కడి సిబ్బంది శ్రీకాకుళంలో సబ్‌డివిజన్‌ కార్యాలయం నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

  • 40 శాతం పనులే..

  • నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనుల కోసం మళ్లీ అంచనాలు రూపొందిస్తున్నారు. రూ.46 కోట్ల జైకా నిధులతో కుడికాలువ ఆధునికీకరణ మధ్యలోనే నిలిచిపోయాయి. ఇప్పటివరకు 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ప్రధానంగా కాలిపేట వద్ద వెల్‌ సైఫన్‌, రంగరాయపురం వద్ద సింగిల్‌ లైన్‌బ్రిడ్జి, మజ్జిలిపేట వద్ద అండర్‌ టన్నెల్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కాలువ పొడవునా లైనింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనుల పూర్తి కోసం కొత్త అంచనాలు తయారుచేస్తున్నారు. పనులు పూర్తి కాకపోవడంతో తమకు సాగునీటి సమస్యలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. ఆధునికీకరణ పనులు పూర్తిచేసి.. తమకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • ఆధునికీకరణ పనులు చేపట్టాలి

  • నారాయణపురం ఆధునికీకరణ పనులను చేపట్టి రైతులను ఆదుకోవాలి. గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో కుడికాలువ ద్వారా శివారు ఆయకట్టకు సాగునీరు చేరింది. రానున్న ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటి నుంచే యుద్ధప్రాతిపదికన కార్యచరణ సిద్ధం చేయాలి.

    - పంచిరెడ్డి కృష్ణారావు, నారాయణపురం ఆనకట్ట ప్రాజెక్ట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు

  • సిబ్బందిని నియమించాలి

  • కింతలి సెక్షన్‌లో సిబ్బంది కొరత వల్ల ప్రతి ఏడాది సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. అవసరమైన సిబ్బందిని నియమించాలి.

    - నక్క లక్ష్మణరావు, మాజీ సర్పంచ్‌, కొంగరాం

  • అంచనాలు రూపొందిస్తున్నాం

  • నారాయణపురం ఆధునికీకరణ పనులు 40 శాతం మేరకు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తిచేసేందుకు మళ్లీ అంచనాలు రూపొందిస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, రైతుల సహకారంతో కుడికాలువ ద్వారా సంతకవిటి మండలం వద్ద హెడ్‌ నుంచి ఎచ్చెర్ల మండలంలోని శివారు గ్రామాల వరకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

    - కె.రాంబాబు, ఏఈఈ, కింతలి సెక్షన్‌

Updated Date - May 26 , 2026 | 11:44 PM