Share News

ఇక్కడో వరద కాలువ ఉండేది

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:47 PM

flood canal.. occupation పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని నెమలికొండ నుంచి పురుషోత్తపురం ఎర్రచెరువు వరకూ విస్తరించిన వరద కాలువ.. ఆక్రమణకు గురవుతూనే ఉంది. గతంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందకముందు.. భీమిలి ఎర్రదిబ్బలను తలపించేది. 6.30 ఎకరాల్లో ఎర్రకాలువ వ్యాపించి ఉండేది.

ఇక్కడో వరద కాలువ ఉండేది
ఆక్రమణలతో నామరూపాలు కోల్పోయిన ఎర్రచెరువు కాలువ

  • నెమలికొండ నుంచి పురుషోత్తపురం ఎర్రచెరువు వరకూ విస్తరించిన కాలువ

  • ఆక్రమణలతో కనుమరుగు

  • పలాస, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని నెమలికొండ నుంచి పురుషోత్తపురం ఎర్రచెరువు వరకూ విస్తరించిన వరద కాలువ.. ఆక్రమణకు గురవుతూనే ఉంది. గతంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందకముందు.. భీమిలి ఎర్రదిబ్బలను తలపించేది. 6.30 ఎకరాల్లో ఎర్రకాలువ వ్యాపించి ఉండేది. వరద కాలువలో స్థానికులు స్నానాలు, ఇతర కార్యక్రమాలు చేసుకునేవారు. ఈ కాలువ మార్గం గుండానే నెమలికొండ-సూదికొండ మధ్యలో వర్షాలకు నీరు ప్రవహించి పురుషోత్తపురం వద్ద ఉన్న ఎర్రకాలువలో కలిసేది. ఎర్రచెరువుకు ఈ ప్రాంతంలో వచ్చే వరదనీరే జీవనాధారం. దీనిద్వారా 300 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగవుతుంది. ప్రస్తుతం పలాస-కాశీబుగ్గ జంటపట్టణాలు అభివృద్ధి చెందడంతో ఎర్రచెరువు చుట్టూ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వైసీపీ హయాంలో పక్కా సర్వే నెంబర్లతో రిజిస్ర్టేషన్లు సైతం జరిగిపోయాయి. ఎర్రచెరువుకు నీరందించే కాలువ ప్రాంతమంతా ఆక్రమణకు గురై ప్రస్తుతం పిల్లకాలువను తలపిస్తోంది. వర్షాకాలంలో వరదవస్తే నీరు ప్రవహించే మార్గంలేక.. ముంపు ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

  • రియల్‌ ఎస్టేట్‌లో కప్పేశారు

  • కిలోమీటరు విస్తీర్ణం, ఆరున్నర ఎకరాల పరిధిలో ఉండే ఈ కాలువ భూముల గుండానే సూదికొండ నుంచి ఎర్రచెరువు వరకూ మార్గం ఏర్పడింది. అది ప్రభుత్వ రికార్డులో కూడా రహదారి మార్గంగానే చూపిస్తూ మూడు ఎకరాలు తీసుకున్నారు. మిగిలిన మూడు ఎకరాలు కూడా ప్రస్తుతం కనుమరుగైంది. భారీ భవంతుల మధ్య కాలువ స్వరూపం మారింది. దిగువకు పిల్ల కాలువగా దర్శనమిస్తున్నా.. పైపైకి వెళ్లే కొద్దీ కాలువ అనేది తెలుసుకోవడం కష్టమే. ఆ ప్రాంతంలో రియల్‌ఎస్టేట్లు వేసి కాలువను అందులో కప్పేశారు. పూర్తిస్థాయి అమ్మకాలు కూడా జరిగిపోయాయి. దీనిపై గతంలో ‘ఆంధ్రజ్యోతి’ అనేక కథనాలు ప్రచురించినా.. రాజకీయ కోణంలో అధికారులు ఆలోచించి కనీస చర్యలు కూడా చేపట్టలేదు.

  • నోటీసులిచ్చినా..

  • టెక్కలి సబ్‌డివిజన్‌లో పలాస ఉన్న సమయంలో అప్పటి అధికారులు.. మొత్తం 127 అక్రమ గృహాలు నిర్మించినట్టు గుర్తించారు. వారందరికీ నోటీసులు అందించినా నిర్మాణాలు మాత్రం ఆపలేకపోయారు. తరువాత వచ్చిన మునిసిపల్‌ కమిషనర్లు.. అనధికార గృహాల నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చినా, దానికి ఇంతవరకూ సమాధానం కూడా లేదు. నోటీసులు ఇచ్చిన వెంటనే కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్‌ను తీసుకువస్తున్నారు. దీంతో అధికారులు సైతం ఏమిచేయలేని పాలుపోని స్థితిలో మౌనం దాల్చాల్సివస్తోంది. వారం రోజుల కిందట కలెక్టర్‌, జేసీ, పలాస ఎమ్మెల్యేతో కూడి బృందం అక్రమార్కులను గుర్తించి చర్యలు ప్రారంభింనా ఈ ప్రాంతంపై ఎటువంటి ఫిర్యాదులు రాకపోవడంతో వెళ్లలేకపోయారు. అధికారులు నెమలికొండ-సూదికొండ పోరంబోకు భూములపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి కొండకాలువను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Feb 05 , 2026 | 11:47 PM