ఇక్కడో చెరువు ఉండేది
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:15 AM
Bhadrakshibandha in the grip of invasions రాజులకాలం నాటి చెరువుపై అక్రమార్కుల కన్ను పడింది. ఆయకట్టు భూములకు సాగునీరు అందించే ఈ చెరువును ఆక్రమించేందుకు వ్యూహం పన్నారు. రెండేళ్ల నుంచి దాన్ని కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ.. వేర్వేరు సర్వే నెంబర్లతో ఆ చెరువునంతా జిరాయితీ భూమిగా మార్చేశారు. ఆపై విక్రయాలకు సిద్ధమవ్వగా.. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న రైతులు ఆందోళన చేశారు.
ఆక్రమణల చెరలో భద్రాక్షిబంద
రికార్డులు తారుమారు చేసిన ఘనులు
అమ్మకానికి బ్రోకర్లకు తాయిలాలు
ఆందోళనలో ఆయకట్టు రైతులు
న్యాయం చేస్తామని అధికారుల హామీ
పలాస, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): రాజులకాలం నాటి చెరువుపై అక్రమార్కుల కన్ను పడింది. ఆయకట్టు భూములకు సాగునీరు అందించే ఈ చెరువును ఆక్రమించేందుకు వ్యూహం పన్నారు. రెండేళ్ల నుంచి దాన్ని కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ.. వేర్వేరు సర్వే నెంబర్లతో ఆ చెరువునంతా జిరాయితీ భూమిగా మార్చేశారు. ఆపై విక్రయాలకు సిద్ధమవ్వగా.. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న రైతులు ఆందోళన చేశారు. అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళితే..
పలాస మండలం తర్లాకోట పంచాయతీలో రాజులకాలం నాటి చెరువు భద్రాక్షిబంద ఆక్రమణల చెరలో చిక్కుకుంది. ఇది సర్వేనెంబరు 78/6లో మొత్తం 3.09 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 15 ఎకరాలకు రికార్డు పరంగా ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తోంది. పరోక్షంగా మరో 35 ఎకరాలకు సాగునీరందుతోంది. వర్షాకాలంలో పలాసలో జగన్నాథసాగరం చెరువు వరకూ ఈ నీరు వస్తుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ చెరువుపై కబ్జాదారులు కన్నేశారు. రెండేళ్ల నుంచి వేరే సర్వే నెంబరు వేస్తు ఆ చెరువునంతా జిరాయతీ భూములుగా మార్చేశారు. సాగుభూమిగా మార్చుతూ.. ఆపై విక్రయానికి కూడా బ్రోకర్లకు తాయిలాలు ఇచ్చారు. ఈక్రమంలో ఈ ప్రాంతానికి బ్రోకర్ల తాకిడి ఎక్కువ కావడంతో రైతులకు అనుమానం వచ్చింది. ఇటీవల తర్లాకోట పంచాయతీలో నిర్వహించిన రీ సర్వేలో ఆ భూమి జిరాయితీగా మారినట్లు కొంతమంది రైతులు గుర్తించారు. చెరువు సర్వేనెంబరులో ఉన్న అడంగళ్ పత్రాలు తీయడంతో వారంతా ఖంగుతిన్నారు. వేరే వ్యక్తుల పేర్లుతో భూమి బదలాయించబడి ఉండడంతో ఆందోళన చెందారు. ఆ ప్రాంతంలో మొత్తం రెండు చెరువులు ఉండగా అవి ప్రైవేటు ఖాతాల్లోకి చేరిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా గుర్తించిన తర్లాకోట, లొద్దభద్ర, సుబ్బుగుడ్డి, మహదేవపురం గ్రామాల రైతులు ఈ చెరువు ప్రాంతంలో గురువారం ఆందోళన చేపట్టారు. చెరువు ఆక్రమణలతో తమకు సాగునీటి కష్టాలు తప్పవని.. ‘పీజీఆర్‌ఎస్’లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణల చెర నుంచి చెరువును కాపాడాలి కోరారు. తమకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా భద్రాక్షి చెరువులో ఉపాఽధి పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నా ఉద్దేశపూర్వకంగానే అధికారులు దీన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఏళ్లతరబడి చెరువుగా గుర్తింపు ఉన్నా ఎందుకు పనులు చేయడం లేదో అధికారులే రైతులకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. దీన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి పన్నిన వ్యూహంగా రైతులు భావిస్తున్నారు.
హద్దులు వేసి అందిస్తాం:
భద్రాక్షి చెరువు మొత్తం 3.09 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉందని రెవెన్యూ సర్వేయర్ వై.గిరి తెలిపారు. రెండురోజల్లో సాంకేతిక ఆధారాలతో హద్దులు గుర్తించి రైతులకు అప్పగిస్తామన్నారు. చెరువులు ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు న్యాయం చేస్తామన్నారు.
అది చెరువే..
భద్రాక్షి చెరువుగా రికార్డుల్లోని ఉంది. మొత్తం 3.09 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు నీటి ద్వారా మేము గతంలో పంటలు పండించుకున్నాం. దీన్ని ఆక్రమించి అమ్ముకోవలని చూడడం దారుణం. అధికారులు తక్షణం స్పందించి చెరువును కాపాడాలి.
- కొయ్యి నారాయణరావు, రైతు, లొద్దభద్ర..
రైతుల పొట్ట కొట్టద్దు
చెరువు కప్పి రైతుల పొట్టకొట్టద్దు. చెరువును కప్పేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది. రైతులకు దీర్ఘకాలికంగా సాగునీరు అందించే వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
- కొయ్యి భూపతి, రైతు, లొద్దభద్ర..