గ్రామాల్లో తాగునీటి సమస్య రాకూడదు
ABN , Publish Date - May 25 , 2026 | 12:05 AM
Receiving petitions in the Public Court వేసవిలో గ్రామాల్లో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాదర్బార్‌లో వినతుల స్వీకరణ
కోటబొమ్మాళి, మే 24 (ఆంధ్రజ్యోతి): వేసవిలో గ్రామాల్లో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎక్కువమంది తాగునీటి సమస్య ఉందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన స్పందించి గ్రామీణ నీటి సరఫరాశాఖ అధికారులకు ఫోన్ చేసి ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించాలని ఆదేశించారు. గత వైసీపీ పాలనలో జరిగిన తప్పిదాలు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేకమంది పేదల భూములు ఇతరుల పేర్లకు మార్పిడి అయ్యాయని పలువురు బాధితులు మంత్రికి ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అఽధికారులతో మాట్లాడి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శక పాలన అందిస్తామని పునరుద్ఘాటించారు. సమస్య ఏదైనా సరే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎన్.కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు కర్రి అప్పారావు, మల్లా బాలకృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు.