నిధుల దుర్వినియోగానికి తావులేదు
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:06 AM
నిధుల వినియోగంలో నిర్లక్ష్యానికి తావులేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు.
పనులు నాణ్యతతో పూర్తిచేయాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 16(ఆంధ్రజ్యోతి): నిధుల వినియోగంలో నిర్లక్ష్యానికి తావులేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ కంపెనీల యాజమాన్య సిబ్బంది, అధికారులతో సీఎస్‌ఆర్ నిధుల మంజూరు, వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పనులు సకాలంలో, పూర్తి నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొక్కల పెంపకం, చెరువులు, కుంటల అభివృద్ధి, తాగునీటి సదుపాయాల కల్పన, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, వర్షపునీటి సంరక్షణ, గ్రామాల్లో పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, జీవనోపాధి కల్పించడం వంటి విషయాలపై తగు సూచనలు చేశారు. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. శాఖల వారీగా సీఎస్‌ఆర్, సీఈఆర్ గ్రాంట్ల ద్వారా మంజూరైన నిధుల వివరాలు, పనుల పురోగతిని పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, తరగతి గదుల నిర్మాణం, ఆసుపత్రులు, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, పరికరాల ఏర్పాటు, తాగునీటి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ కేవీ రమణ, సీపీవో ప్రసన్నలక్ష్మి, పరిశ్రమల జీఎం శ్రీధర్, మత్స్యశాఖ జేడీ సుమలత, సుడా ఈఈ పొగిరి సుగుణాకర్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఎండీ బి.దేవరాజు, బ్యాంకు అధికారులు, కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.