వానల్లేవ్!
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:08 AM
39 percent rainfall deficit ఖరీఫ్ సీజన్‌లో వరుణుడు మొహం చాటేశాడు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగాల్సిన జూలైలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లాలో 39 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
జిల్లాలో 39 శాతం లోటు వర్షపాతం
9 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు
అడుగంటిన జలాశయాలు
ఆందోళనలో ఖరీఫ్ రైతులు
శ్రీకాకుళం, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌లో వరుణుడు మొహం చాటేశాడు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగాల్సిన జూలైలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లాలో 39 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వర్షాలు లేక సాగునీటి ప్రాజెక్టులు అడుగంటిపోగా, జల సంరక్షణ నిర్మాణాలు చుక్కనీరు లేక వెక్కిరిస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లావ్యాప్తంగా జూన్ 1 నుంచి జూలై 19 వరకు సాధారణ వర్షపాతం 206.15 మి.మీ కురవాల్సి ఉండగా.. కేవలం 126.06 మి.మీ మాత్రమే నమోదైంది. అంటే 38.85 శాతం లోటు ఏర్పడింది. జిల్లాలోని 9 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదు కాగా, 14 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
లావేరు మండలంలో మాత్రమే సాధారణం (159.7 మి.మీ) కంటే 29.3 అధికంగా (206.5 మి.మీ) వర్షం కురవడం గమనార్హం. కొత్తూరు, లక్ష్మీనర్సుపేట, రణస్థలం, సరుబుజ్జిలి, సోంపేట, శ్రీకాకుళం మండలాల్లో మొత్తం ఆరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
పోలాకి మండలంలో అత్యధికంగా 83.8 శాతం లోటు వర్షపాతం (216.7 మి.మీ కురవాల్సి ఉండగా 35.1 మి.మీ నమోదు) ఏర్పడింది. నందిగాంలో 80.16 శాతం, గారలో 76.1 శాతం, పొందూరులో 74.53 శాతం, ఆమదాలవలసలో 72.03 శాతం, సారవకోటలో 67.98 శాతం, కవిటిలో 66.27 శాతం, వజ్రపుకొత్తూరులో 63.53 శాతం, ఇచ్ఛాపురంలో 62.99 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
అడుగంటిన ప్రాజెక్టులు..
వర్షాలు లేకపోవడంతో జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్‌కు చేరువవుతున్నాయి. వంశధార నదిపై ఉన్న గొట్టాబ్యారేజీ పూర్తిస్థాయి సామర్థ్యం 0.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.59 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక్కడికి 1910 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1695 క్యూసెక్కులు కిందికి వదిలేస్తున్నారు.
హిరమండలం రిజర్వాయర్ పరిస్థితి దయనీయంగా ఉంది. 10 టీఎసీల పూర్తి సామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో ప్రస్తుతం కేవలం 2.67 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. పైనుంచి దీనికి ప్రస్తుతం చుక్క నీరు కూడా రావడం లేదు.
కళింగదల్ ప్రాజెక్టులో (0.15 టీఎంసీల సామర్థ్యం) కేవలం 0.02 టీఎంసీలు, దామోదరం సాగరంలో (0.06 టీఎంసీల సామర్థ్యం) 0.02 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దామోదరం సాగరానికి 110 క్యూసెక్కుల వరద వస్తుండగా, 100 క్యూసెక్కులు వదులుతున్నారు.
నారాయణపురం ఆనకట్ట వద్ద 600 క్యూసెక్కుల వరద వస్తుండగా, 550 క్యూసెక్కులు వదులుతున్నారు.
నీటి సంరక్షణ నిర్మాణాలూ.. అంతే
జిల్లావ్యాప్తంగా వర్షపు నీటిని నిల్వ చేసి, భూగర్భ జలాలను పెంచేందుకు ప్రభుత్వం నిర్మించిన మొత్తం 31,529 నీటి సంరక్షణ నిర్మాణాలు చుక్కనీరు లేక ఎడారిని తలపిస్తున్నాయి.
జిల్లాలోని ఈ నిర్మాణాల పూర్తి సామర్థ్యం 2138.72 మిలియన్ ఘనపు అడుగులు(ఎంసీఎఫ్‌టీ) కాగా, వానలు లేక ప్రస్తుతం వీటిలో కేవలం 1 శాతం అంటే 22.45 ఎంసీఎఫ్‌టీల నీరు మాత్రమే నిల్వ ఉండటం గమనార్హం.
ఇందులో 4,135 చెక్‌డ్యామ్‌ల సామర్థ్యం 1450.55 ఎంసీఎఫ్‌టీ కాగా, ప్రస్తుతం కేవలం 9.15 ఎంసీఎఫ్‌టీల నీరు నిల్వ ఉంది.
6761 వ్యవసాయ కుంటలతో 6.19 ఎంసీఎఫ్‌టీ, 534 పర్కొలేషన్ ట్యాంకుల్లో 0.83 ఎంసీఎఫ్‌టీ, ఇతర 20,099 నిర్మాణాల్లో 6.27 ఎంసీఎఫ్‌టీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.
లావేరు మండలంలో అత్యధికంగా 1,848 నిర్మాణాలు (210.84 ఎంసీఎఫ్‌టీ సామర్థ్యం) ఉన్నా, కేవలం 0.78 ఎంసీఎఫ్‌టీ నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎచ్చెర్లలో 1950 నిర్మాణాలున్నా 2.99 ఎంసీఎఫ్‌టీ, రణస్థలంలో 1335 నిర్మాణాలున్నా 1.07 ఎంసీఎఫ్‌టీ నీరు నిల్వ ఉంది.
భూగర్భ జలాలతో ఊరట
వర్షాలు ముఖం చాటేసి, ప్రాజెక్టులు ఎండిపోయినప్పటికీ.. జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి మెరుగ్గా ఉండటం అన్నదాతలకు కాస్త ఊరటనిస్తోంది. ఈ నెల 19 నాటికి జిల్లా సగటు భూగర్భ జలమట్టం 6.90మీటర్ల లోతులో లభ్యమవుతోంది. గతేడాది ఇదే సమయానికి భూగర్భ జలం 8.83 మీటర్ల లోతులో ఉంది. గతేడాదితో పోలిస్తే జలాలు బాగా పైకి వచ్చాయి.
లక్ష్మీనర్సుపేట 1.47 మీటర్లలో, సరుబుజ్జిలిలో 1.74, జి.సిగడాంలో 1.85. హిరమండలంలో 1.95, టెక్కలిలో 2.61 మీటర్లలో భూగర్భ జలాలు పైకి ఉన్నాయి. కవిటి, కంచిలి, రణస్థలం, పలాస లాంటి ప్రాంతాల్లో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయిలో 12 మీటర్ల కంటే దిగువకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కవిటిలో 20.17 మీటర్లు, కంచిలిలో 13.87, రణస్థలంలో 13.20, వజ్రపుకొత్తూరులో 13.20, పలాసలో 12.24 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కరవు పరిస్థితులు తప్పవని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాగునీటి కోసం పాట్లు
ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల అడపాదడపా కురిసిన వర్షాలతో.. వరిఎదలు, నారుమడులు వేశారు. కాగా.. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక వరిఎదలు, నారుమడులు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాటిని కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నారు. గార మండలంలోని అంపోలు, వత్సవలస తదితర ప్రాంతాల్లో కొందరు రైతులు దూరంగా ఉన్న చెరువుల్లో కొద్దిపాటి నీటిని పైపులద్వారా నారుమడులకు అందిస్తున్నారు. బూర్జ మండలంలోనూ ఇదే దుస్థితి నెలకొంది. ఒక వైపు వర్షాలు కురవక, మరోవైపు కాలువలు ద్వారా సాగునీరు అందక రైతులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సమీపంలో బావుల నుంచి నీటిని తెచ్చి వరినాట్లు తడుపుతున్నారు. వరుణ దేవుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు.