Share News

డీజిల్‌ లేదంట!

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:31 AM

Motorists queue at petrol bunk stations జిల్లాలో డీజిల్‌ కష్టాలు ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధం ఫలితంగా ఇప్పటికే గ్యాస్‌ సిలిండర్‌లు సకాలంలో సరఫరా కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా డీజిల్‌ కొరతతో మరింత అవస్థలు తప్పవని ఆందోళన చెందుతున్నారు.

డీజిల్‌ లేదంట!
శ్రీకాకుళం : పీఎస్‌ఆర్‌ జంక్షన్‌ వద్ద బంకులో పెట్రోల్‌ కోసం బారులుదీరిన వాహనదారులు

  • బంకుల వద్ద బారులుదీరిన వాహనదారులు

  • కొన్నిచోట్ల పెట్రోల్‌ కూడా లేదంటూ ‘నో స్టాక్‌’ బోర్డులు

  • (శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి బృందం)

  • జిల్లాలో డీజిల్‌ కష్టాలు ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధం ఫలితంగా ఇప్పటికే గ్యాస్‌ సిలిండర్‌లు సకాలంలో సరఫరా కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా డీజిల్‌ కొరతతో మరింత అవస్థలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. సోమవారం జిల్లావ్యాప్తంగా పలు బంకుల వద్ద వాహనదారులు బారులుదీరారు. పలుచోట్ల గంటల తరబడి నిరీక్షించారు. ఇంకొన్నిచోట్ల నోస్టాక్‌ బోర్డులు దర్శనమివ్వడంతో నిరాశతో వెనుదిరిగారు. చాలా బంకుల్లో డీజిల్‌ నిండుకోవడంతో అవస్థలు పడ్డారు.

  • ఎచ్చెర్ల మండలంలోని సాయుధ పోలీసు క్వార్టర్స్‌ సమీపంలో, అల్లినగరం జంక్షన్‌కు సమీపంలో, చిలకపాలెం-పొందూరు రోడ్డులో బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

  • పొందూరులోని పెట్రోల్‌ బంకుల్లో వాహనదారులు గంటల తరబడి వేచి ఉన్నారు. మధ్యాహ్నం నుంచి పెట్రోల్‌ అందుబాటులో లేక నిరాశతో వెనుదిరిగారు. కొన్ని బంకుల్లో నగదు ఉంటేనే పెట్రోల్‌ ఇచ్చారు. ఫోన్‌పే, పేటీఎం చెల్లింపులకు నిరాకరించారు.

  • ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లో కొన్ని బంకుల్లో సాధారణ పెట్రోల్‌ నిండుకోవడంతో పవర్‌ పెట్రోల్‌ లీటర్‌పై రూ.10 అదనంగా వసూలు చేశారు. సరుబుజ్జిలికి చెందిన కొంతమంది రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్లతో డీజిల్‌ కోసం ఆమదాలవలస, జలుమూరు, హిరమండలంలో బంకుల వద్దకు వెళ్లారు.

  • నరసన్నపేటలో రెండు బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టగా.. పోలీసుల సమక్షంలో పెట్రోల్‌ పంపింగ్‌ చేశారు.

  • ఎల్‌.ఎన్‌.పేట మండలంలో రెండు బంకుల వద్ద డీజిల్‌ పూర్తిగా లేదు. పెట్రోల్‌కు ఇంతవరకు ఎలాంటి కొరతలేదు. కానీ ముందు జాగ్రత్తగా చాలామంది వాహనదారులు పెట్రోల్‌ కోసం బంకుల వద్ద బారులుదీరారు.

  • జలుమూరు మండలంలో డీజిల్‌ కొరత ఏర్పడింది. లింగాలవలస, చల్లవానిపేట, బుడితి, అచ్యుతాపురం, శ్రీముఖలింగంలోని పెట్రోల్‌ బంకుల్లో సోమవారం మధ్యాహ్నానికి డీజిల్‌ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

  • పోలాకి మండలం వెదుళ్లవలసలో పెట్రోల్‌, చల్లబంద బంక్‌ వద్ద డీజిల్‌ లేకపోవడంతో వాహనదారులు వెనుదిరిగారు.

  • రణస్థలం మండలంలోని పెట్రోల్‌ బంకుల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయింత్రం వరకూ ఇంధన కొరత ఏర్పడింది. పైడిభీమవరంలోని బంకు వద్ద పెట్రోల్‌, డీజిల్‌ కోసం వాహనదారులు బారులుదీరారు.

  • జి.సిగడాం మండలంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత కారణంగా బంక్‌ల వద్ద నో స్టాక్‌ బోర్డులను ఏర్పాటు చేశారు.

  • హిరమండలంలోని మూడు బంకుల్లో డీజల్‌ నిల్వలు లేవు. బ్యారేజీ సెంటర్‌లో ఐటీడీఏకి చెందిన బంకులో నోస్టాక్‌ బోర్డు పెట్టారు.

  • పలాస-కాశీబుగ్గలోని బంకుల వద్ద వాహనదారులు బారులుదీరారు. కాగా.. పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని యజమానులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పుకార్లు నమ్మొద్దని స్పష్టం చేశారు.

  • పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు : కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • ‘జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికావద్ద’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘జిల్లాలో ప్రస్తుతం నాలుగు రోజులకు సరిపడా 713 కిలో లీటర్ల పెట్రోల్‌, 734 కిలోలీటర్ల డీజిల్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రతీరోజు ఐఓసీఎల్‌, హెచ్‌సీపీఎల్‌, బీపీసీఎల్‌ కంపెనీలు నిరంతర సరఫరా చేస్తున్నాయి. విశాఖపట్నం నుంచి నిత్యం పెట్రోల్‌ ట్యాంకర్లు వస్తున్నాయి. సోమవారం కూడా అదనంగా మరో 230 కిలోలీటర్ల డీజిల్‌ జిల్లాకు చేరుకుంది. అపోహల కారణంగా సగటు కన్నా సోమవారం ఒక్కరోజే 165 కిలో లీటర్ల పెట్రోల్‌, 210 కిలోలీటర్ల డీజిల్‌ అదనంగా విక్రయాలు సాగాయి. ఫలితంగా కొన్ని బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు వెలిశాయి. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమ వ్యాపారానికి పాల్పడినా కఠినచర్యలు తప్పవు. పెట్రోల్‌ సరఫరాలో ఇబ్బందులు ఉంటే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు. ప్రతీ బంకు వద్ద ఒక పోలీసు, రెవెన్యూ సిబ్బందిని కాపలా ఉంచాం. ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయి. నోస్టాకు బోర్డు పెట్టిన యజమానులు మళ్లీ ఏ సమయానికి ఇంధనం అందుబాటులో ఉంటుందో స్పష్టం చేయాలి. రైతులకు, వ్యవసాయ, ఆక్వా, హార్టికల్చర్‌ రంగాల వారికి ఇబ్బంది లేకుండా కూపన్లపై సరఫరా చేస్తాం. బల్క్‌ విక్రయాల పేరిట 300 లీటర్ల కంటే ఎక్కువ ఒకేసారి ఇవ్వరాద’ని స్పష్టం చేసారు.

  • ఎస్పీ కెవి.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘పెట్రోల్‌, డీజిల్‌ ఇళ్లల్లో నిల్వ ఉంచడం అత్యంత ప్రమాదకరం. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పేలుళ్లకు దారితీసే అవకాశం ఉంది. ఎవరైనా అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు. జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఉందంటూ అసత్య ప్రచారాలు, సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వదంతులను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌,అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పండ్యా కూడా పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 12:31 AM