కళాశాలల్లో ఆటల్లేవ్
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:17 AM
Unfilled PD posts in junior colleges కళాశాల స్థాయిలో క్రీడలకు సంబంధించి ప్రోత్సాహం కరువవుతోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలైనా.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంతవరకూ పీడీ పోస్టులు భర్తీ చేయలేదు. కనీసం తాత్కాలిక ప్రాతిపదికనైనా నియమించలేదు.
జూనియర్ కాలేజీల్లో భర్తీకాని పీడీ పోస్టులు
మూడు నెలలుగా కానరాని క్రీడాపోటీలు
ఇచ్ఛాపురం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): కళాశాల స్థాయిలో క్రీడలకు సంబంధించి ప్రోత్సాహం కరువవుతోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలైనా.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంతవరకూ పీడీ పోస్టులు భర్తీ చేయలేదు. కనీసం తాత్కాలిక ప్రాతిపదికనైనా నియమించలేదు. మైదానాలు ఉన్నా క్రీడల నిర్వహణ లేదు. జిల్లాలో 38 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. సుమారు 10 వేల మంది విద్యార్ధులు చదువుతున్నారు. కానీ వీరికి క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు కనీస స్థాయిలో ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుడు సైతం లేకపోవడం దారుణం. గతంలో జూనియర్ కాలేజీల్లో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలు కొనసాగేవి. ఏటా వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాపోటీలు నిర్వహించేవారు. కానీ వారు పదవీవిరమణ తరువాత కొత్తగా పోస్టులు భర్తీ చేయలేదు. సబ్జెక్టు బోధకుల మాదిరిగా కాంట్రాక్టు ప్రతిపాదికన నియమించలేదు. దీంతో కాలేజీల్లో క్రీడా శిక్షణ లేకుండా పోయింది. జిల్లాకేంద్రంలో ప్రభుత్వ కాలేజీల్లో సైతం క్రీడలు కరువయ్యాయి.
మైదానాల కొరత..
జిల్లాలో చాలా ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మైదానాలు లేవు. 38 కాలేజీలకుగాను 4 కాలేజీల్లో అసలు మైదానాలే లేవు. 21 కాలేజీల్లో మైదానాలు సరైన నిర్వహణ లేక అస్తవ్యస్తంగా మారాయి. కొన్నిచోట్ల గత వైసీపీ సర్కారు నాడు-నేడు పనుల పేరిట అస్తవ్యస్తంగా మార్చేసింది. భవన నిర్మాణ సామగ్రితో పాటు తొలగించిన భవనాలకు సంబంధి వేస్ట్ మెటీరియల్‌ను పడేసింది. దీంతో ఆటలు అనేవి లేకుండా పోయాయి. ఆ ఐదేళ్లపాటు ప్రభుత్వ కాలేజీల స్థాయిలో క్రీడాపోటీలు కూడా నిర్వహించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని, మైదానాలను మెరుగుపరచాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు.
దృష్టిపెట్టాం
వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాం. జిల్లాలోని 38 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నియామకాలకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమిస్తాం.
- సురేష్‌కుమార్, ఆర్‌ఐవో, శ్రీకాకుళం