వసతులు లేవు.. వంట గది లేదు
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:00 AM
మండలంలోని చీడివలస పంచాయతీ పరిధిలో గల జిల్లేడువలస ప్రాఽథమికోన్నత పాఠశాలలో సమస్యలు తిష్ఠవేశాయి.
పోలాకి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని చీడివలస పంచాయతీ పరిధిలో గల జిల్లేడువలస ప్రాఽథమికోన్నత పాఠశాలలో సమస్యలు తిష్ఠవేశాయి. ఇక్కడ ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ 60 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే దశాబ్దాల కాలం కిందట నిర్మించిన ఈ భవనం శిఽథిలావస్థకు చేరింది. వర్షం కురిస్తే పాఠశాలకు సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ కనీస వసతులు సైతం లేవు. పాఠశాల మధ్యాహ్నభోజన వంటగది లేదని వంటనిర్వాహకులు వాపోతున్నారు. 2009లో నిర్మించిన రెండంతస్థుల భవనంలో వసతులు లేకపోవడంతోపాటు మరుగుదొడ్లు లేక ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ విద్యార్థినులు, ఉపాధ్యాయినులు అవస్థలుపడుతున్నారు. వసతులు లేకపోవడంతో పాఠశాలకు విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. ప్రహరీ లేకపోవడంతో పాముల, ఆక్రమణల బెడద తప్పడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పాఠశాల పరిసరాల్లో మామిడి, కొబ్బరితోటలు ఉండడంతో పాములు, తేళ్లు, విష కీటకాలు వస్తున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నా రు. కాగా జిల్లేడువలస యూపీపాఠశాలకు ప్రహరీకోసం ప్రతిపాదనలు పంపించా మని, త్వరలో ప్రహరీ నిర్మిస్తామని, మౌలిక వసతుల కల్పనకు ఉన్నతాధికారులకు లేఖలు రాశామని హెచ్‌ఎం బి.భారతి, ఎంఈవో ఎస్.శ్రీనివాసరెడ్డి తెలిపారు.