నిధులున్నాయ్.. నీరేలేదు!
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:52 PM
Negligence in Jaljeevan Mission work గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’(జేజేఎం) పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ నెల 18న శ్రీకాకుళంలో జిల్లా రివ్యూ కమిటీ(డీఆర్సీ) సమావేశంలో జల్‌జీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
జల్‌జీవన్ మిషన్ పనుల్లో నిర్లక్ష్యం
జిల్లాలో ప్రారంభానికి నోచుకోని 817 పనులు
కంచిలి, కవిటి, సంతబొమ్మాళి మండలాల్లో అధ్వానం
ఉద్దానం ఫేజ్-2కు బ్రేకులు..
కాంట్రాక్టర్లకు రూ.76.86 కోట్ల బకాయిలు
శ్రీకాకుళం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’(జేజేఎం) పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ నెల 18న శ్రీకాకుళంలో జిల్లా రివ్యూ కమిటీ(డీఆర్సీ) సమావేశంలో జల్‌జీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కాగితాలపై రూ.వేల కోట్ల నిధులు కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నట్టు ఈ సమీక్ష ద్వారా వెల్లడైంది. కొన్ని మండలాల్లో ఇంకా పనులు ప్రారంభం కాకపోవడం అధికారుల ఉదాసీనతకు అద్దం పడుతోంది. ప్రస్తుత వేసవి వేళ.. జేజేఎం పనుల వేగాన్ని పెంచి.. లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది.
జిల్లావ్యాప్తంగా 1,224 రెవెన్యూ గ్రామాల పరిధిలో జల్‌జీవన్ మిషన్ పథకం కింద 4,286 పనులను రూ.2,076.62 కోట్లతో మంజూరు చేశారు. ఇప్పటివరకు కేవలం 1,190 పనులు మాత్రమే పూర్తయ్యాయి. వివిధ దశల్లో 2,156 పనులు కొనసాగుతున్నాయి. వీటిలో 723 ఎన్‌ఏఆర్ పనులు, 1,433 ఇతర పనులు ఉన్నాయి. ఏకంగా 817 పనులు కనీసం ప్రారంభానికి నోచుకోలేదు. మరో 87 పనులను ఏజెన్సీలకు ఇంకా అప్పగించలేదు. 36 పనులు అవసరం లేదని తేల్చారు. జిల్లాలో మొత్తం 5,35,764 ఇళ్లకు కుళాయిలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 2,36,705 ఇళ్లకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. పనుల్లో జాప్యం కారణంగా మిగిలిన ఇళ్లకు కుళాయిలు అమర్చలేదు.
డేంజర్ బెల్స్ ప్రాంతాలివే..
జిల్లాలో ప్రారంభం కాని 817 పనుల్లో అధికంగా టెక్కలి సబ్‌డివిజన్ పరిధిలో 364, ఇచ్ఛాపురం సబ్ డివిజన్‌లో 351 పనులు ఉండటం గమనార్హం. క్షేత్రస్థాయిలో మండలాల వారీగా పరిశీలిస్తే అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కంచిలి మండలంలో అత్యధికంగా 130 పనులు ఇంకా మొదలు కాలేదు. కవిటిలో 114, సంతబొమ్మాళిలో 105, నందిగాంలో 97, కోటబొమ్మాళిలో 88, సోంపేటలో 64, ఇచ్ఛాపురంలో 43 పనులు ప్రారంభానికి నోచుకోలేదు. నరసన్నపేటలో 196, పాతపట్నంలో 151 పనులు పూర్తయ్యాయి.
ఉద్దానం ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి..?
కిడ్నీ ప్రభావిత ప్రాంతాల కోసం రూ.700 కోట్లతో చేపట్టిన ఉద్దానం పేజ్-1 ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రాజెక్టు కింద రూ. 642.02 కోట్లు ఖర్చు చేశారు. ఎలాంటి బిల్లులు పెండింగ్ లేవు. అయితే రూ. 265 కోట్లతో చేపట్టిన ఉద్దానం ఫేజ్-2 ప్రాజెక్ట్ మాత్రం పురోగతిలో ఉంది. ఇప్పటివరకు దీనిపై రూ.36.38 కోట్లు ఖర్చు చేయగా.. ఏకంగా రూ.30.36 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండడంతో ప్రాజెక్ట్ వేగానికి బ్రేకు పడింది.
పెండింగ్ బిల్లుల గుదిబండ...
జిల్లావ్యాప్తంగా జేజేఎం పనుల కింద ఇప్పటివరకు రూ.889.38 కోట్లు ఖర్చు చేయగా, పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూ.76.86 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఉద్దానం ఫేజ్-2కు అత్యధికంగా రూ.30.36 కోట్లు బకాయి ఉండగా... నరన్నపేట సబ్ డివిజన్‌లో రూ. 9.88 కోట్లు, ఆమదాలవలసలో రూ.9.25కోట్లు, శ్రీకాకుళంలో రూ.7.77 కోట్లు మేర బిల్లులు పెండిగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు పనుల నిర్వహణపై ఆసక్తి చూపడం లేదు. వేసవి కాలం దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా, తుది దశలో ఉన్న పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన వెంటనే పూర్తి చేయాలని ఇటీవల ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అలాగే ఆగిపోయిన పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.