Share News

దేవాలయాలే లక్ష్యంగా చోరీలు

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:53 PM

Arrest of three members accused రాత్రివేళల్లో దేవాలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.16 లక్షల విలువైన ఐదున్నర కిలోల వెండి, తులం బంగారం వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

దేవాలయాలే లక్ష్యంగా చోరీలు
మాట్లాడుతున్న డీఎస్పీ వివేకానంద, పోలీసుల అదుపులో నిందితులు

  • ముగ్గురు నిందితుల అరెస్టు

  • ఐదున్నర కిలోల వెండి, తులం బంగారం స్వాధీనం

  • పలు కేసులు చేధించిన శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు

  • శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాత్రివేళల్లో దేవాలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.16 లక్షల విలువైన ఐదున్నర కిలోల వెండి, తులం బంగారం వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. లావేరు మండలం యజ్జాడపాలేనికి చెందిన ఇజ్జాడ గౌరీ ప్రసాద్‌, తమిరి రాజారావు, రణస్థలం మండలం నగరపాలేనికి చెందిన కరమజ్జి గోవిందులు ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. రాత్రివేళల్లో హుండీల్లో నగదు, విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను అపహరించారు. గత నెల 26న పాత్రునివలసలో దుర్గాదేవి ఆలయంలో చోరీ చేశారు. దీనిపై శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. బంగారు శతమానం, పుస్తెలు 2, బంగారు కళ్లు 2, వెండి కిరీటం, వెండి చేతులు 5, చిన్నవెండి కిరీటం, వెండి వడ్డాణం, వెండి పంచపాత్ర, వెండి ఉద్దరణ తదితర వస్తువులను అపహరించినట్టు గుర్తించారు. శుక్రవారం రణస్థలం ఫ్లైఓవర్‌ కింద ఆ ముగ్గురిని అరెస్టు చేశాం. వారి నుంచి సుమారు రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామ’ని డీఎస్పీ వివేకానంద తెలిపారు. కేసును చేధించిన రూరల్‌ సీఐ పైడిపునాయుడు, ఎస్‌ఐ సురేష్‌, కానిస్టేబుళ్లు జగదీష్‌, త్రినాఽథ్‌, బాబూరావు, సూరిబాబు, వేణు, రవి ఇతర పోలీస్‌ సిబ్బందిని అభినందించారు.

  • ఎన్నో కేసులు..

  • ఈ ముగ్గురు నిందితులపై గతంలో పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గతేడాది ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురం రామాలయంలో వెండి కిరీటాలు, శఠగోపం, పూజాసామగి తదితర వెండి వస్తువులు దొంగతనం చేశారు. అలాగే కేశవరావుపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో కూడా చోరీ చేశారు. వీటిపై ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

  • బూర్జ మండలం లచ్చన్నపేటలో గతేడాది నీలమణి దుర్గాదేవి ఆలయంలో రెండు హుండీలు పగులకొట్టి సుమారు రూ.5 వేలు నగదు అపహరించారు. ఈ ఏడాది సింగన్నపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో సుమారు రూ.10 వేలు నగదు దొంగిలించారు. వీటిపై బూర్జ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

  • ఈ ఏడాది శ్రీకాకుళం నగరం గైనేటి వీధిలో ఓ పల్సర్‌ బైక్‌ను దొంగిలించారు. శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

  • కోటబొమ్మాళి మండలం వింజంపాడు గ్రామంలోని బాబా దేవాలయంలో కిరీటం దొంగతనం చేశారు. హుండీ పగులగొట్టి నగదు అపహరించారు. దీనిపై కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని డీఎస్పీ వివేకానంద తెలిపారు.

Updated Date - Sep 12 , 2026 | 11:53 PM