విలాసాల కోసం చోరీలు
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:41 AM
విలాసాలకు అలవాటు పడి... దొంగతనాలను వృత్తిగా చేసుకున్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
దొంగతనం కేసుల్లో నిందితుడి అరెస్టు
110కి పైగా కేసులు ఉన్నట్టు పోలీసుల వెల్లడి
రూ.41.50 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం
శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): విలాసాలకు అలవాటు పడి... దొంగతనాలను వృత్తిగా చేసుకున్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడిని అరెస్టు చేసి.. సుమారు 26.5 తులాల (సుమారు 300 గ్రాములు) బంగారు, 1.29 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్.వివేకానంద తెలిపారు. వీటి విలువ సుమారు రూ.41.50 లక్షలు ఉంటుందని వెల్లడించారు. శుక్రవారం శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పత్తికాయ పాలవలసకు చెందిన వున్నాన రాంబాబు అలియాస్ నిహాన్(30)పై జిల్లాలోని జి.సిగడాం, జేఆర్‌పురం, కోటబొమ్మాళి, సారవకోట, నరసన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో పది చోరీ కేసులు ఉన్నాయని చెప్పారు. విజయనగరం జిల్లాలోనూ కేసు ఉందని చెప్పారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో రాంబాబు చోరీ చేసేవాడని డీఎస్పీ తెలిపారు. ఆ ఆభరణాలను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి నగదు పొందేవాడన్నారు. ఆ నగదును విలాసాలతో పాటు క్రికెట్ బెట్టింగ్‌కు వినియోగించేవాడని చెప్పారు. నిందితుడిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో 110కిపైగా దొంగతనం కేసులు ఉన్నట్టు వెల్లడించారు. అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీ సి.హెచ్.వివేకానంద పర్యవేక్షణలో జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, జి.సిగడాం ఎస్‌ఐ అప్పలసూరి, సిబ్బంది కేసులను చేధించినట్టు తెలిపారు. కేసుల చేధనలో ప్రతిభ చూపిన సిబ్బందిని ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారని డీఎస్పీ చెప్పారు.