పగలు పాకా విలాస్‌లో.. రాత్రిపూట చోరీలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:40 AM
Arrest of three interstate thieves పగలంతా పాకా విలాస్ (టిఫిన్ సెంటర్)లో ఉంటారు. రాత్రిపూట బయటకొచ్చేస్తారు. ప్లాన్ ప్రకారం ఇళ్లలోకి చొరబడతారు. దొరికింది ఎత్తుకెళ్తారు. అరెస్టయితే జైలుకెళ్లి.. బయటకు వచ్చి మళ్లీ పనికానిచ్చేడం వీరి పని. ఇలా చోరీలు చేస్తూ.. తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.32.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతోపాటు నగదును స్వాధీనం చేసుకున్నారు.
జైలుకెళ్లి.. బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలు
ముగ్గురు అంతరాష్ట్ర దొంగల అరెస్టు
రూ.32.50 లక్షల బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం
పలాస, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): పగలంతా పాకా విలాస్ (టిఫిన్ సెంటర్)లో ఉంటారు. రాత్రిపూట బయటకొచ్చేస్తారు. ప్లాన్ ప్రకారం ఇళ్లలోకి చొరబడతారు. దొరికింది ఎత్తుకెళ్తారు. అరెస్టయితే జైలుకెళ్లి.. బయటకు వచ్చి మళ్లీ పనికానిచ్చేడం వీరి పని. ఇలా చోరీలు చేస్తూ.. తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.32.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతోపాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను శనివారం కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో శ్రీకాకుళం ఎఎస్పీ పి.శ్రీనివాసరావు విలేకరులకు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడిలోని కండ్రవీధికి చెందిన పొట్నూరు మిన్నారావు.. చిన్నపాకా విలాస్ (టీ, టిఫిన్ దుకాణం) నిర్వహిస్తున్నాడు. ఈయనకు తాపీ పనులు, పెయింటింగ్ పనులు చేస్తున్న బెనియా దుర్గాప్రసాద్, దేటా మండల్‌తో పరిచయం ఏర్పడింది. ఈ ముగ్గురూ పగలు పాకా విలాస్‌లో ఉంటూ.. రాత్రులు వ్యూహాలు వేస్తూ అనేక దొంగతనాలకు పాల్పడ్డారు. వీరు గతంలో ఒడిశాలో కూడా అనేక చోరీలు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకూ పర్లాకిమిడి జైలులో శిక్షను అనుభవించారు. అనంతరం బెయిల్‌పై వచ్చినా.. తీరు మార్చుకోలేదు. ఈ ఏడాది మే, జూన్, ఆగస్టులో మెళియాపుట్టి మండలం పద్మాపురం, పాతపట్నం మొండిగల్లవీధి, శివశంకర్‌నగర్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఈ నెల 5న వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలిలో.. మిన్నారావు మేనమామ ఇంట్లో కూడా చోరీ చేసి ఆభరణాలు, నగదు దొంగిలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు దీనిపై పోలీసులు నిఘా పెట్టారు. శనివారం బెండి రోడ్డులో ఆ ముగ్గురు ద్విచక్ర వాహనంపై వస్తున్నట్లు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. పోలీసులను చూసి భయంతో వెళ్లిపోవడానికి ప్రయత్నించగా.. వారిని కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. దర్యాప్తు చేయగా.. వారు గతంలో చేసిన చోరీలు సైతం బయటపడ్డాయి. ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. మూడు నేరాలకు సంబంధించి 27 తులాల బంగారం దొంగతనం చేయగా.. వారి నుంచి 17 తులాలు రికవరీ చేశారు. 1640 గ్రాముల వెండి, రూ.4 లక్షల నగదు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన బంగారంలో 10 తులాలు వివిధ బ్యాంకుల్లో తాకట్టు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని కూడా త్వరలోనే రికవరీ చేస్తామని ఎఎస్పీ తెలిపారు. మొత్తం చోరీ విలువ రూ.47.80 లక్షలు కాగా, 32.50లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసుకు సంబంధించి డీఎస్పీ భవానీ పోలీసులను సమన్వయం చేయగా, సీఐ ఎం.తిరుపతిరావు, క్రైమ్ ఎస్‌ఐ చంద్రమౌళి, ఎస్‌ఐలు భరత్, కె.మధుసూధనరావు, క్రైమ్ హెచ్‌సీ శ్రీనివాస్, మాధవ్, హరీష్, ఆలీ, విజయ్‌ను ఆయన అభినందించారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, నగదును కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు అప్పగిస్తామని తెలిపారు.