టెక్కలిలో చోరీ
ABN , Publish Date - May 29 , 2026 | 12:00 AM
Four tulas of gold and 29 kg of silver stolen టెక్కలి మేజర్ పంచాయతీ పాతజాతీయ రహదారి పోలీస్‌స్టేషన్‌కు సమీపాన వెంకటేశ్వరకాలనీలోని బొరిగి లక్ష్మీనారాయణ నివాసంలో చోరీ జరిగింది. లక్ష్మీనారాయణ తన భార్యతో కలిసి బెంగళూరులో ఉంటున్న కుమారుడి దగ్గరకు నెలరోజుల కిందట వెళ్లారు. కాగా.. గురువారం ఉదయం పనిమనిషి ఇంటి వరండాలో మొక్కలకు నీలు పోసేందుకు వెళ్లగా.. ప్రధాన ద్వారం తలుపులు బద్దలై ఉన్నట్టు గమనించింది.
నాలుగు తులాల బంగారం, 29కేజీల వెండి అపహరణ
రూ. లక్ష నగదు కూడా
టెక్కలి, మే 28(ఆంధ్రజ్యోతి): టెక్కలి మేజర్ పంచాయతీ పాతజాతీయ రహదారి పోలీస్‌స్టేషన్‌కు సమీపాన వెంకటేశ్వరకాలనీలోని బొరిగి లక్ష్మీనారాయణ నివాసంలో చోరీ జరిగింది. లక్ష్మీనారాయణ తన భార్యతో కలిసి బెంగళూరులో ఉంటున్న కుమారుడి దగ్గరకు నెలరోజుల కిందట వెళ్లారు. కాగా.. గురువారం ఉదయం పనిమనిషి ఇంటి వరండాలో మొక్కలకు నీలు పోసేందుకు వెళ్లగా.. ప్రధాన ద్వారం తలుపులు బద్దలై ఉన్నట్టు గమనించింది. ఆమె, స్థానికులతో కలిసి.. బెంగళూరులో ఉన్న ఇంటి యజమాని లక్ష్మీనారాయణకు సమాచారం ఇచ్చారు. ఆయన గురువారం సాయంత్రానికి తన ఇంటికి చేరుకుని పరిశీలించారు. ప్రధాన ద్వారంతోపాటు.. లోపల ద్వారాలు పగులగొట్టి.. బెడ్‌రూమ్‌లో లాకర్‌ను కోసి ఉన్నట్టు గుర్తించారు. సుమారు రూ.లక్ష నగదు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు, 29 కేజీల వెండి వస్తువులు చోరీ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరాతీశారు. క్రైమ్ ఏఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో క్లూస్‌టీం బృందం వేలిముద్రలు సేకరించింది. డాగ్‌స్క్వాడ్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి.. జిల్లా కేంద్ర ఆసుపత్రి ప్రాంగణం వైపు వెళ్లింది. మరోవైపు సీసీఎల్ సీఐ చంద్రమౌళి, రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రాము, సిబ్బంది ఉదయం నుంచి వివరాలు సేకరించారు. ఈ సంఘటన మంగళ, బుధవారాల్లో రాత్రివేళ జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. వెంకటేశ్వర కాలనీలో చోరీ సంఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆ ప్రాంతంలో ఒకటి, రెండుచోట్ల సీసీ కెమెరాలు ఉన్నా అవి పనిచేయనట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. .