శుభకార్యాలకు సామగ్రి ఇస్తూ.. ఇళ్లకు కన్నం
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:42 AM
Three members arrest నరసన్నపేట సర్కిల్ పరిధిలోని 12 చోరీ కేసులకు సంబంధించి ముగ్గురి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 31 తులాలు బంగారం, 68 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నరసన్నపేటలోని సర్కిల్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ పి.శ్రీనివాసరావు వెల్లడించారు.
12 చోరీ కేసుల్లో ముగ్గురు నిందుతుల అరెస్టు
31 తులాలు బంగారం, 68 తులాలు వెండి ఆభరణాలు స్వాధీనం
నరసన్నపేట, జనవరి 23(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట సర్కిల్ పరిధిలోని 12 చోరీ కేసులకు సంబంధించి ముగ్గురి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 31 తులాలు బంగారం, 68 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నరసన్నపేటలోని సర్కిల్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ పి.శ్రీనివాసరావు వెల్లడించారు. జలుమూరు మండలం గంగన్నపేటకు చెందిన చల్ల అచ్యుతరావు ఎస్‌ఆర్‌కే సప్లయర్స్ నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద మాకివలసకు చెందిన పొన్నాన యోగీశ్వరరావు, అల్లు నరేంద్ర పనిచేస్తున్నారు. ఈ ముగ్గురూ పెళ్లిళ్లు, శుభకార్యాలకు టెంట్‌లు, వంట సామగ్రి సరఫరా చేసేవారు. ఆ సమయంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి.. రాత్రివేళల్లో చోరీకి పాల్పడేవారు. నగరికటకం, జలుమూరు, సవిరిగాం, అల్లాడ, శ్రీముఖలింగం, కూనలచ్చున్నాయుడుపేట, బుడితి, కోమర్తి, తలసముద్రం తదితర గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. జలుమూరు మండలం కొమనాపల్లి వద్ద ఎస్ అశోక్‌బాబు ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. ఈ క్రమంలో అటుగా వాహనంలో వెళ్తున్న ఈ ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని ప్రశ్నించగా చోరీల బండారం బయటపడింది. వేలిముద్రలు ఆధారంగా గతంలో నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాల్లో చేసిన 12 చోరీల గుట్టు రట్టయింది. ఆ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని ఏఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. వారి నుంచి 31 తులాలు బంగారం, 68 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారు వినియోగించిన మహేంద్ర థార్ వాహనాన్ని సీజ్ చేశామని తెలిపారు. చోరీ కేసులు చేధించిన ఎస్‌ఐ అశోక్‌బాబుతోపాటు ఉత్తమ ప్రతిభ చూపిన సిబ్బంది ఎం.ధర్మరాజు, ఎం.వెంకటేష్, టి.వెంకట్రావు, ఎం.ధర్మారావు, నాగరాజు, ఎం. దాలినాయుడును అభినందించారు. కార్యాక్రమంలో టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, జలుమూరు, పోలాకి, సారవకోట, నరసన్నపేట ఎస్‌ఐలు ఆశోక్‌బాబు, రంజిత్, అనిల్, శేఖరరావు పాల్గొన్నారు.