Share News

కంచిలి ఉన్నత పాఠశాలలో చోరీ

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:02 AM

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో దొంగలు పడి మైక్రోస్కోప్‌తో పాటు మధ్యాహ్న భోజన పథకం కోసం ఉంచిన బియ్యం, ఇతర ఆహార పదార్థాలను దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు అందింది.

 కంచిలి ఉన్నత పాఠశాలలో చోరీ
పాఠశాలలో చిందరవందరగా పడి ఉన్న పుస్తకాలు

కంచిలి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో దొంగలు పడి మైక్రోస్కోప్‌తో పాటు మధ్యాహ్న భోజన పథకం కోసం ఉంచిన బియ్యం, ఇతర ఆహార పదార్థాలను దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. మధ్యాహ్న భోజన కార్మికులు, పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.... దసరా సెలవుల అనంతరం గురువారం ఉదయం పాఠశాల తెరిచేందుకు వచ్చిన ఉపాధ్యాయులు స్టోర్‌ రూమ్‌తోపాటు ఆఫీస్‌ రూం, ల్యాబ్‌ రూమ్‌ తాళాలు పగలగొట్టడం గమనించి లోపలికి వెళ్లి చూశారు. ల్యాబ్‌ గదిలో ఉన్న మైక్రోస్కోప్‌తో పాటు సైన్స్‌ కిట్‌ కనబడకపోవడం గుర్తించారు. అలాగే ఆఫీసు రూంలో ఉన్న సేఫ్‌లు, బీరువాలు తెరిచి పుస్తకాలను చిందరవందరగా పడివేసి ఉంది. స్టోర్‌ రూంలో ఉంచిన 25 బియ్యం బస్తాలు, 15 లీటర్ల ఆయిల్‌ క్యాన్‌లు 7.50కిలోల కందిపప్పు, 25 కిలోల పెసర పప్పు, 50 కిలోల చింతపండు, బిర్యానీ మసాలా దినుసులు ఒక ప్యాకెట్‌ దొంగిలించినట్లు తెలిపారు. వీటితో పాటు ఉపాధ్యాయుల హ్యాండ్‌ బుక్‌లు దొంగిలించినట్లు ఇన్‌చార్జి హెచ్‌ఎం పసుపులేటి రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనపై కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నట్టు కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు.

Updated Date - Oct 23 , 2026 | 12:02 AM