Share News

యువతరం.. ప్రగతిపథం

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:29 AM

Youth excelling in the fields of agriculture and business వారంతా చదువుకున్నారు. ఉన్నత ఉద్యోగావకాశాలు వచ్చినా.. స్వగ్రామంలోనే ఉంటూ.. ఉపాధి మార్గాలు అన్వేషించారు. వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తున్నారు. తాము లాభపడుతూ.. స్థానికంగా చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు.

యువతరం.. ప్రగతిపథం
ఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్‌లో పనిచేస్తున్న కార్మికులు.. ఇన్‌సెట్‌లో జి.వెంకటరావు

  • వ్యవసాయ, వ్యాపార రంగాల్లో రాణిస్తున్న యువత

  • ‘పది’ చదివి.. పారిశ్రామికవేత్తగా ఎదిగిన జీవీఆర్‌

  • రూ.40వేల పెట్టుబడితో.. రూ.30కోట్ల టర్నోవర్‌

  • నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం

  • నరసన్నపేట/ మెళియాపుటి/ పలాస, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి):

  • వారంతా చదువుకున్నారు. ఉన్నత ఉద్యోగావకాశాలు వచ్చినా.. స్వగ్రామంలోనే ఉంటూ.. ఉపాధి మార్గాలు అన్వేషించారు. వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తున్నారు. తాము లాభపడుతూ.. స్థానికంగా చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు. బుధవారం అంతర్జాయతీ యువజన దినోత్సవం సందర్భంగా ఆదర్శ బాటలో పయనిస్తున్న యువత విజయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

  • పోలాకి మండలం మాకివలస గ్రామానికి చెందిన గొల్లంగి వెంకటరావు.. అలియాస్‌ జీవీఆర్‌ పదో తరగతి వరకు చదివారు. పది తరగతి పాసైన తర్వాత తాను వ్యాపారం చేస్తానని వెంకటరావు తన తల్లికి చెప్పారు. 25 ఏళ్ల కిందట ఆమె బంధువుల వద్ద రూ.40వేలు అప్పు చేసి ఇవ్వగా.. వెంకటరావు ఆ డబ్బుతో ఫెర్టిలైజర్‌ వ్యాపారాన్ని ప్రారంభించగా నష్టాలను చవిచూశారు. దీంతో బీరువాల తయారీ, విక్రయాలపై దృష్టి సారించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా ఎగుమతి చేస్తున్నారు. నాడు చిన్నస్థాయిలో ప్రారంభమైన బీరువాల తయారీ.. నేడు భారీ పరిశ్రమగా వృద్ధి చెందింది. రోజుకు 100 బీరువాలు తయారుచేసే స్థాయికి చేరి.. 150 మందికిపైగా స్థానికులకు ఉపాధి కల్పిస్తోంది.

  • ‘స్నాక్స్‌’ విషయంలో చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ.. వెంకటరావు ఐదేళ్ల కిందట తల్లి సరోజనమ్మ పేరిట ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. చేగోడియాలు, చుప్పులు, బేకరీ, బిస్కెట్లు వివిధ రకాల తినుబండారాలు తయారు చేస్తున్నారు. జీవీఆర్‌ బ్రాండ్‌తో వ్యాపార సామ్రాజ్యాన్ని గ్రామాలకు సైతం విస్తరించారు. ఈ యూనిట్‌లో మరో 150 మందికిపైగా స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం సుమారు రూ.30కోట్ల టర్నోవర్‌కి చేరుకుని ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. విజయానికి చదువు ఒక్కటే ప్రామాణికం కాదని, నేర్చుకోవాలనే తపన, కష్టపడే స్వభావం ఉండాలని గొల్లంగి వెంకటరావు చెబుతున్నారు.

  • ఈ ఇంజనీరు ఆదర్శరైతు

  • ఆయన చదివింది.. ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింట్‌నెన్స్‌ ఇంజనీరింగ్‌. కానీ వ్యవసాయంపై మక్కువతో యాంత్రీకరణ సాగుపై దృష్టి సారించారు. ఆధునిక పద్ధతులతో పంటలు పండిస్తూ.. ఆదర్శ రైతుగా గుర్తింపు పొందారు. ఆయనే నరసన్నపేట మండలం జమ్ము గ్రామానికి చెందిన రెడ్డి సతీష్‌. ఈ ఇంజనీర్‌ ఎనిమిదేళ్లుగా నూతన పద్ధతులతో సాగు చేస్తూ జిల్లాస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. యాంత్రీకరణ విధానంలో వరిసాగు చేస్తూ.. ఏటా తక్కువ పెట్టుబడితో ఎకరాకు 40బస్తాలకుపైగా ధాన్యం దిగుబడి సాధిస్తున్నారు. వరితోపాటు రాగి, నువ్వు, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలను సైతం సేంద్రియ విధానంలో పండిస్తున్నారు. వరినాట్లు దశ నుంచి పంట కోత వరకు.. అన్నింటికీ యంత్రాలను వినియోగిస్తున్నారు. డ్రోన్లతో పురుగు మందుల నివారణ పిచికారీ చేస్తున్నారు. యంత్రాలతో సాగు వలన సమయం ఆదాతోపాటు లాభదాయకంగా ఉంటుందని సతీష్‌ స్పష్టం చేస్తున్నారు.

  • అటు వ్యవసాయం.. ఇటు వ్యాపారం

  • మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన పోలాకి తేజేశ్వరరావు రెండేళ్ల కిందట సుమారు రూ.40లక్షల పెట్టుబడితో నాటుకోళ్లతోపాటు పౌల్ర్టీ కోళ్ల పెంపకం ప్రారంభించారు. వాటికి ఆర్గానిక్‌ ఆహారం వేసి పెంచుతున్నారు. మరోవైపు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. ఐదు ఎకరాల్లో జామ, బొప్పాయి, కూరగాయాలతో పాటు సుగర్‌ లెస్‌ వరి వంగడాలు, పూతోటలు పెంచుతూ.. విక్రయాలు సాగిస్తున్నారు. స్థానికంగా సుమారు పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తనకు వచ్చిన లాభాల్లో.. వారికి ప్రతినెలా రూ.20వేలు చొప్పున వేతనం అందిస్తున్నారు. ఖర్చులు పోనూ ప్రతినెలా తనకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకూ ఆదాయం వస్తుందని తేజేశ్వరరావు తెలిపారు. ‘నాతోపాటు మరో నలుగురికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పౌల్ర్టీ వ్యాపారం ప్రారంభించాను. సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నాం. కోళ్లకు ఆహారంతోపాటు.. వ్యవసాయానికి ఆర్గానిక్‌ పద్ధతిలో ఎరువులు తయారు చేస్తున్నాం. అజొల్లా మొక్కలు పెంచి కోళ్లకు మేతగా వేస్తున్నాం. దీనివల్ల కోళ్లకు జబ్బులు రావు. వాటిని తినేవారికి ఇబ్బందులు ఉండవు’ అని తేజేశ్వరరావు తెలిపారు.

  • కుటీర పరిశ్రమ నుంచి అంతర్జాతీయస్థాయికి..

  • పలాసకు చెందిన సంతోష్‌కుమార్‌ సాధారణ వ్యాపార కుటుంబానికి చెందినవారు. స్థానిక పారిశ్రామికవాడలో 2005లో కంపెనీని ప్రారంభించారు. దేశీయంగా లభించే జీడి పిక్కలను ముందుగా నిర్వహించేవారు. అనంతరం దీనిపై పూర్తి పట్టు సాధించిన తరువాత ఆటోమెటిక్‌ ప్రాసెసింగ్‌లోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం రోజుకు 25 మెట్రిక్‌ టన్నుల జీడిపప్పును ప్రాసెసింగ్‌ చేస్తున్నారు. పలాసతో పాటు తూర్పుగోదావరి జిల్లా తునిలో కూడా బ్రాంచ్‌ను నిర్వహిస్తున్నారు. 2016 నుంచి అంతర్జాతీయ ఎగుమతులు ప్రారంభించారు. పలాస నుంచి దుబాయ్‌ తదితర విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ఎస్‌ఎస్‌ఎస్‌ పరిశ్రమ అగ్రస్థానంలో ఉంది. 2020లో ఉత్తరాంధ్ర జిల్లాలో లేని విధంగా ఆటోమెటిక్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఉత్పత్తులను పెంచడంతో పాటు ఎక్కడా లేని విధంగా ఏకంగా 300 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ఏడాది నుంచి 45 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు ప్రారంభించారు. కాగా రోజూ 3 టన్నుల జీడిపప్పును ఇక్కడి నుంచి టీటీడీకి సరఫరా చేస్తున్నారు. పలాసను ఆసియాలోనే అతిపెద్ద జీడిపప్పు ప్రాసెసింగ్‌ యూనిట్‌గా తయారు చేయడానికి తగు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కోరాడ సంతోష్‌కుమార్‌ చెబుతున్నారు.

Updated Date - Aug 12 , 2026 | 12:29 AM