గ్రామపెద్దల మాటే శిరోధార్యం
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:12 AM
The Unity of the Villagers of Nuvvalarevu ఎక్కడైనా స్థానిక ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. గ్రామాల్లో ఒకటే హడావుడి. అటు అభ్యర్థులు.. ఇటు ఓటర్లలో సందడే సందడి. తమను గెలిపించాలంటూ సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం సైతం పంపిణీ చేస్తారు. కానీ వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో మాత్రం గ్రామపెద్దల మాటే శాసనం.
స్థానిక ఎన్నికల్లో పోటీ లేకుండా అభ్యర్థుల ఎంపిక
ఈసారీ రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
ఐక్యతలో ఆదర్శంగా నిలిచిన నువ్వలరేవు గ్రామస్థులు
వజ్రపుకొత్తూరు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ఎక్కడైనా స్థానిక ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. గ్రామాల్లో ఒకటే హడావుడి. అటు అభ్యర్థులు.. ఇటు ఓటర్లలో సందడే సందడి. తమను గెలిపించాలంటూ సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం సైతం పంపిణీ చేస్తారు. కానీ వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో మాత్రం గ్రామపెద్దల మాటే శాసనం. పెద్దలే అభ్యర్థులను నిర్ణయిస్తారు. ఎటువంటి ప్రలోభాలు లేకుండా.. ఆ అభ్యర్థులనే గ్రామస్థులంతా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచీ ఈ సంప్రదాయమే కొనసాగుతోంది. ఎన్నికల్లో పోటీ లేకుండా.. ఐక్యతకు మారుపేరుగా.. ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుత ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా గ్రామపెద్దల నిర్ణయమే శిరోధార్యమైంది. ఈసారి రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులను బరిలో దించేందుకు ప్రయత్నించడంతో పోటీ తప్పదనే ప్రచారం జరిగింది. అయితే గ్రామస్థులు మరోసారి తమ ఐక్యతను చాటుకుంటూ.. ఇటీవల గ్రామదేవత బృందావతిమాత ఆలయం వద్ద సమావేశమయ్యారు. నువ్వలరేవు ఒకటో ఎంపీటీసీ స్థానానికి బైనపల్లి జానకి, రెండో ఎంపీటీసీ స్థానానికి బెహరా అన్నపూర్ణను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. ఆ ఇద్దరు టీడీపీ తరపున నామినేషన్లు వేశారు. ఆ ఇద్దరూ ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంగళవారం అధికారులు ప్రకటించారు. ఎన్నికల వేళ.. గ్రామస్థుల్లో మనస్పర్థలు లేకుండా ఉండేందుకు అందరి సమక్షంలోనే అభ్యర్థులను ఎంపిక చేసి.. ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని గ్రామపెద్దలు తెలిపారు.
కట్టుబాట్లను గౌరవించాల్సిందే
గ్రామంలో కట్టుబాట్లు, ఆచారాలను అందరూ గౌరవించాల్సిందే. గ్రామంలో సమావేశమై అందరి సమక్షంలో నిర్ణయం తీసుకుంటాం. గ్రామపెద్దల నిర్ణయం మేరకు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం.
మువ్వల పూర్ణచంద్రరావు, మాజీ సర్పంచ్
ఐక్యంగా ఉంటాం
నా చిన్నప్పటి నుంచి మా గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలను ఏక్రగీవంగా ఎన్నుకుంటాం. కేవలం జడ్పీటీసీ ఎన్నికల సమయంలోనే ఓటు వేస్తాం. అప్పుడు కూడా గ్రామ పెద్దల నిర్ణయం ప్రకారం ఓటింగ్లో పాల్గొంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా అందరం ఐక్యంగా ఉంటాం. మేమంతా బంధువులమే కాబట్టి తగాదాలకు దూరంగా ఉంటాం.
తోటమ్మ, నువ్వలరేవు