Share News

భర్తను కడతేర్చిన భార్య

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:05 AM

Alcoholic fight, knife attack తాళికట్టిన భర్తను కత్తిపీటతో దాడి చేసి.. కడతేర్చిన ఘటన శ్రీకాకుళంలో కలకలం రేపింది. గురువారం రాత్రి ప్రకాష్‌నగర్‌ కాలనీలో జరిగిన ఈ ఘటనలో ధర్మాన అసిరినాయుడు(46) మృతి చెందాడు.

భర్తను కడతేర్చిన భార్య
అసిరినాయుడు మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ ఈశ్వరరావు

మద్యం మత్తులో తరచూ గొడవలు

సహనం కోల్పోయి కత్తిపీటతో దాడి

కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు

శ్రీకాకుళం క్రైం, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): తాళికట్టిన భర్తను కత్తిపీటతో దాడి చేసి.. కడతేర్చిన ఘటన శ్రీకాకుళంలో కలకలం రేపింది. గురువారం రాత్రి ప్రకాష్‌నగర్‌ కాలనీలో జరిగిన ఈ ఘటనలో ధర్మాన అసిరినాయుడు(46) మృతి చెందాడు. స్థానికులు, టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన అసిరినాయుడు భార్య జయలక్ష్మీ, కుమారుడు మణికంఠతో కలిసి శ్రీకాకుళంలోని ప్రకాష్‌నగర్‌ కాలనీలో అద్దె ఇంటిలో కొన్నాళ్లుగా నివసిస్తున్నారు. అసిరినాయుడు జలుమూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వద్ద కారుడ్రైవర్‌గా, మణికంఠ కొరియర్‌ బాయ్‌గా పనిచేస్తున్నారు. నిత్యం మద్యం సేవించే అలవాటు ఉండడంతో అసిరినాయుడు తరచూ భార్యతో తగాదా పడుతుండేవాడు. ఈక్రమంలో గురువారం కూడా రాత్రి పది గంటల సమయంలో మద్యం సేవించి భార్య జయలక్ష్మీతో తగాదా పడ్డాడు. వారిద్దరి మధ్య పెనుగులాట జరగ్గా.. కోపానికి తట్టుకోలేకపోయిన జయలక్ష్మీ వంట గదిలో ఉన్న కత్తిపీటతో అసిరినాయుడు తల, మెడపైన దాడి చేసింది. దీనితో అసిరినాయుడు తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయాడు. విధులు ముగించుకుని కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుమారుడు మణికంఠ.. రక్తపుమడుగులో ఉన్న తండ్రిని చూసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించాడు. వారు అక్కడకు చేరుకొని పరిశీలించగా.. అప్పటికే అసిరినాయడు మృతి చెందినట్టు తెలిపారు. దీంతో టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్‌ సీఐ ఈశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌టీం సిబ్బందితో ఆధారాలు సేకరించారు. మణికంఠ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు తెలిపారు.

Updated Date - Jun 06 , 2026 | 12:05 AM