తీరు మారలే!
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:00 AM
ఎప్పటిలాగే జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం రాజకీయ విమర్శలకే పరిమితమైంది.
- రాజకీయ విమర్శలకే పరిమితమైన సమావేశం
- కేవలం రెండు శాఖలపైనే చర్చ
- రాజకీయాల జోలికెళ్లిన వైసీపీ సభ్యులు
- దీటుగా బదులిచ్చిన ఎమ్మెల్యేలు
- ఇరు వర్గాల వాగ్వాదం
- అర్ధాంతరంగా ముగిసిన జడ్పీ సమావేశం
శ్రీకాకుళం, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఎప్పటిలాగే జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం రాజకీయ విమర్శలకే పరిమితమైంది. ప్రజా సమస్యలపై గానీ, వాటి పరిష్కారంపై గానీ చర్చించలేదు. సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని సమావేశాన్ని పక్కదోవ పట్టించారు. కేవలం రెండు శాఖలపై తూతూ మంత్రంగా చర్చించారు. అనంతరం ఇరు వర్గాల వాగ్వాదాలు, విమర్శలతో సమావేశం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ముందుగా నీటిపారుదల శాఖపై, తర్వాత వ్యవసాయ శాఖపై చర్చజరిగింది. ఎరువుల కోసం రెండు ఓటీపీలు ఇవ్వాల్సి వస్తోందని, వాటి కోసం ప్రతి రైతు కనీసం ఐదు గంటల పాటు వేచిచూడాల్సి వస్తోందని, సాగునీరు శివారు భూములకు సక్రమంగా అందడంలేదని కొంతమంది సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారు. పలాసలో సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన యాక్సిడెంట్‌లో మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇచ్చిందని.. అదే రీతిలో టెక్కలి నియోజకవర్గంలో ఎరువుల కోసం వెళ్లి మరణించిన మహిళకు అందజేయాలని డిమాండ్ చేశారు. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు మాట్లాడుతూ.. సీదిరి కుమారుడు చేసిన ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయం అందించలేదని.. తెలుగుదేశం పార్టీ తరఫున అందిందని అన్నారు. వాస్తవాలు తెలుసుకోవాలని, రాజకీయాల ప్రస్తావన వద్దని బదులిచ్చారు. దీనిపై ఇతర వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీపీలు కలుగజేసుకోవడంతో సమావేవం చర్చ దారిమళ్లింది. దీంతో సమావేశాన్ని ముగిస్తున్నట్లు జడ్పీ చైర్‌పర్సన్ ప్రకటించారు. సమావేశంలో రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జడ్పీ సీఈవో వెంకట్రామన్, ఉమ్మడి జిల్లా జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రిని గౌరవించడం తెలియదా?: పీయూసీ చైర్మన్ కూన రవికుమార్
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని ఇక్కడ విమర్శించడమేంటని.. పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ప్రశ్నించారు. సంబంధంలేని విషయంలో అచ్చెన్నాయుడును విమర్శిస్తే.. మేం ఎమ్మెల్యే జగన్మోహన్‌రెడ్డి అని విమర్శించగలమంటూ ధీటుగా బదులిచ్చారు. చర్చించాల్సిన అంశాలను పక్కనబెట్టి ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తే ఇంకా గట్టిగా బదులివ్వగలమంటూ వెల్లడించారు. అలాగే ఇరిగేషన్ విషయంలో అధికారులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నా కాలువల పనుల విషయంలో పూర్తిస్థాయి చర్యలు తీసుకోలేకపోయారని అన్నారు.
రౌడీయిజం చేసేందుకు వచ్చారా? ఎమ్మెల్యే గొండు శంకర్
‘జడ్పీటీసీలు, ఎంపీపీలు సీట్ల నుంచి లేచి వచ్చి.. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటి?. రౌడీయిజం చేసేందుకు వచ్చారా?. పలాసలో జరిగిన ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలను ఎందుకు జగన్మోహన్‌రెడ్డి పరామర్శించలేదు?. యాదవుల ప్రాణాలంటే లెక్కలేదా..? సభ్యులు ప్రజాసమస్యలపైనే మాట్లాడాలి’ అని అన్నారు.
ఎరువుల కోసం వెళ్లి ఆ వృద్ధురాలు చనిపోలేదు: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
‘నందిగాం మండలంలో ఎరువుల కోసం వెళ్లి వృద్ధురాలి మృతి చెందిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. వృద్ధురాలు అక్కడకు వచ్చాక.. గుండెలో నొప్పి అని అనడంతో అక్కడే ఉన్న పోలీసు సీపీఆర్ చేయడంతో పాటు అంబులెన్స్ కూడా పిలిపించారు. వ్యవసాయ అధికారి కూడా సహకారం అందించారు. అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు వైద్యులతో కూడా మాట్లాడాను. ఎక్కడా తొక్కిసలాట జరిగినట్లు ఆమె శరీరంపై ఆనవాళ్లు లేవని వైద్యులు చెప్పారు. గుండెపోటుతోనే ఆమె మరణించారు.’