మింగేసిన అల
ABN , Publish Date - Oct 22 , 2026 | 01:18 AM
కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఆశతో ఉపాధి కోసం అడుగులు వేసిన నలుగురు యువతీ యువకుల జీవితాలు సముద్రపు అలల్లో ముగిశాయి. దసరా సెలవుల సందర్భంగా విహారయాత్రకు వెళ్లిన నెక్ట్స్ ఏరా పైవ్రేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ముగ్గురు యువతులు సముద్రంలో మునిగిపోగా, వారిని రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడు కూడా ప్రాణాలు కోలోయాడు.
పీజీపేట తీరంలో దసరా విహారయాత్ర విషాదం
సముద్రంలో మునిగిన ముగ్గురు యువతులు
ఇద్దరి మృతదేహాలను బయటకు తెచ్చిన యువకుడు
మరో యువతి కోసం సంద్రంలోకి వెళ్లి గల్లంతు
ఒడ్డుకు కొట్టుకుని వచ్చిన ఇద్దరి మృతదేహాలు
కన్నవారి కష్టాలు తీర్చాలని.. కుటుంబానికి చేదోడుగా నిలవాలని ఉపాధి బాట పట్టారు. దసరా పండగ వేళ సరదాగా గడిపేందుకు సముద్రతీరానికి వెళ్లారు. ముగ్గురు యువతులు అలల్లో చిక్కుకోవడంతో వారిని కాపాడేందుకు ఓ యువకుడు వెళ్లాడు. ఇద్దరిని ఒడ్డుకు చేర్చినా వారి ప్రాణాలు దక్కలేదు. మరో యువతి కోసం మళ్లీ సముద్రంలోకి వెళ్లిన అతడూ తిరిగిరాలేదు. పిల్లలు ప్రయోజకులై కుటుంబాలకు అండగా నిలుస్తారని ఆశించిన తల్లిదండ్రులకు చివరకు కడుపుకోతే మిగిలింది. బతుకుదెరువు కోసం బయలుదేరిన బిడ్డలు విగతజీవులై తిరిగిరావడంతో నాలుగు కుటుంబాల్లో తీరని విషాదం అలముకుంది.
రక్షించేందుకు వెళ్లి..
వీరఘట్టానికి చెందిన విక్రమ్ డిగ్రీ పూర్తి చేసి సంస్థలో చేరాడు. సముద్రంలో మునిగిపోతున్న ముగ్గురు యువతులను చూశాడు. కాపాడేందుకు ప్రాణాలకు తెగించి అలల మధ్యకు వెళ్లాడు. ఇద్దరిని ఒడ్డుకు చేర్చినా.. అప్పటికే వారు చనిపోయారు. ఇంకో యువతి కోసం మళ్లీ సముద్రంలోకి వెళ్లిన అతడూ తిరిగిరాలేదు. ముగ్గురు యువతుల ప్రాణాలు కాపాడాలన్న తపనలో తన ప్రాణాన్నీ కోల్పోయాడు.
శ్రీకాకుళం కైరం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఆశతో ఉపాధి కోసం అడుగులు వేసిన నలుగురు యువతీ యువకుల జీవితాలు సముద్రపు అలల్లో ముగిశాయి. దసరా సెలవుల సందర్భంగా విహారయాత్రకు వెళ్లిన నెక్ట్స్ ఏరా పైవ్రేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ముగ్గురు యువతులు సముద్రంలో మునిగిపోగా, వారిని రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడు కూడా ప్రాణాలు కోలోయాడు. శ్రీకాకుళం రూరల్ మండలం పీజీపేట సముద్రతీరంలో మంగళవారం జరిగిన ఈ విషాద ఘటనలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు బుధవారం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. పిల్లల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సెల్ఫీలు దిగుతూ.. లోతులోకి వెళ్లి
శ్రీకాకుళం కొత్తరోడ్డు వద్ద ఉన్న నెక్ట్స్ ఏరా పైవ్రేట్ లిమిటెడ్ శిక్షణా సంస్థకు చెందిన 25మంది యువతీ యువకులు దసరా సందర్భంగా సంస్థలో పూజలు ముగించుకుని, పైవ్రేటు వ్యాన్‌లో పీజీపేట సముద్రతీరానికి విహారయాత్రకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు దిగుతూ, సముద్రపు నీటిలో ఆడుకుంటుండగా కొందరు లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సాలూరు మండలం కొండమామిడిపల్లికి చెందిన మర్రి మహి (18), విజయనగరం జిల్లా రామభద్రపురానికి చెందిన గొల్లపల్లి పావని (19), గజపతినగరం మండలం కెంగువకు చెందిన కొండల మాధవి (19) సముద్రంలో మునిగిపోయారు. వారిని గమనించిన వీరఘట్టానికి చెందిన బిడ్డిక విక్రమ్ (25) రక్షించేందుకు సముద్రంలోకి వెళ్లాడు. మహి, పావనిని ఒడ్డుకు తీసుకొచ్చినా అప్పటికే వారు మృతిచెందారు. గల్లంతైన మాధవి కోసం విక్రమ్ మరోసారి సముద్రంలోకి వెళ్లి తాను కూడా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ డీఎఫ్‌వో మోహనరావు సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో మంగళవారం రాత్రి గాలింపు నిలిపివేశారు. గల్లంతైన విక్రమ్, మాధవి మృతదేహాలు బుధవారం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం
వీరఘట్టానికి చెందిన విక్రమ్ డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లుగా ఈ సంస్థలో పనిచేస్తున్నాడు. తండ్రి నాగేశ్వరరావు గ్రామంలో వ్యవసాయం చేస్తుండగా, తల్లి సావిత్రి గృహిణి. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వాసు, కరుణ్ అనే ఇద్దరు తమ్ముళ్లకు విక్రమ్ పెద్దన్న. అతడి మృతితో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది.
రామభద్రపురానికి చెందిన పావని ఇంటర్ పూర్తి చేసి నెల రోజుల క్రితమే సంస్థలో చేరి శిక్షణ పొందుతోంది. ఆమె తండ్రి రామారావు పెయింటింగ్ పనులు చేస్తుండగా, తల్లి గృహిణి. పావనికి మరో ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.
గజపతినగరం మండలం కెంగువకు చెందిన మాధవి డిప్లొమా చదువుతూనే ఉపాధి కోసం రెండు నెలల క్రితం సంస్థలో చేరింది. ఆమె తల్లిదండ్రులు పైడిరాజు, లక్ష్మి కూలి పనులు చేస్తున్నారు. మాధవికి ఏడేళ్ల తమ్ముడు ఉన్నాడు.
సాలూరు మండలం కొండమామిడిపల్లికి చెందిన మహి ఇంటర్ పూర్తి చేసి రెండు నెలల క్రితం సంస్థలో చేరి శిక్షణ పొందుతోంది. ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న పిల్లలు కుటుంబాలకు ఆసరాగా నిలుస్తారని ఆశించిన తల్లిదండ్రులకు వారి మరణం తీరని విషాదాన్ని మిగిల్చింది.
ఉద్యోగంతో ఆసరా అవుతారని ఆశిస్తే..
సంస్థలో చేరేందుకు తొలుత రూ.2వేల దరఖాస్తు రుసుం చెల్లించామని, సంస్థ అందించిన దుస్తులను రూ.45వేలకు కొనుగోలు చేశామని మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఇంటింటికీ తిరిగి దుస్తులు విక్రయిస్తూ వచ్చే కమీషన్‌ను కుటుంబాలకు పంపేవారని చెప్పారు. సంస్థ యాజమాన్యం వారికి భోజనం, వసతి కల్పించేదని వివరించారు. పిల్లలు ఉపాధి పొందుతూ కుటుంబాలకు అండగా నిలుస్తారని భావించామని, ఇంతలోనే విగతజీవులుగా మారడం తట్టుకోలేకపోతున్నామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ పిల్లలను విహారయాత్రకు ఎలా పంపించారని సంస్థ సిబ్బందిని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలను బయటకు పంపవద్దని, పంపితే సమాచారం ఇవ్వాలని గతంలో కోరినా సంస్థ యాజమాన్యం పట్టించుకోలేదని బాధిత కుటుంబాలు ఆరోపించాయి.
తరచూ ప్రమాదాలు.. ఆందోళనలో స్థానికులు
పీజీపేట సముద్రతీరంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో గత మే 20వ తేదీన ఇద్దరు బాలురు మృతిచెందగా, తాజాగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ప్రాంతంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది.
బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తాం: డీఎస్పీ
శ్రీకాకుళం డీఎస్పీ ధనుంజయనాయుడు, సీఐ రామకృష్ణ శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై రూరల్ ఎస్‌ఐ కరణం వెంకటసురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.