అల.. మింగేసింది
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:53 PM
Death of a fisherman సముద్రంలో మరబోటు బోల్తాపడి ఒక మత్స్యకారుడు మృతి చెందగా, మరో నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అలల ఉధృతి కారణంగా చోటుచేసుకున్న ఈ ఘటన.. మృతుడి కుటుంబ సభ్యుల్లో తీరని విషాదాన్ని నింపింది.
సముద్రంలో మరబోటు బోల్తా
మత్స్యకారుడి మృతి.. మరో నలుగురు సురక్షితం
దేవునల్తాడలో విషాదం
వజ్రపుకొత్తూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): సముద్రంలో మరబోటు బోల్తాపడి ఒక మత్స్యకారుడు మృతి చెందగా, మరో నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అలల ఉధృతి కారణంగా చోటుచేసుకున్న ఈ ఘటన.. మృతుడి కుటుంబ సభ్యుల్లో తీరని విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామానికి చెందిన మత్స్యకారుడు అమర మోహనరావు(50).. సముద్రంలో బోటుబోల్తాపడి మృతి చెందాడు. శనివారం ఉదయం 5 గంటల సమయంలో మోహనరావు.. స్థానిక మత్స్యకారులు బుడగాటి నుకరాజు, తులే వెంకటరమణ, బుడగాటి రాజు, చింతల హేమరావుతో కలిసి సముద్రంలో చేపలవేటకు వెళ్లాడు. తిరిగొస్తున్న సమయంలో అలల ఉధృతి కారణంగా మరబోటు బోల్తాపడింది. అందులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సముద్రంలో చెల్లాచెదురయ్యారు. వీరిలో నలుగురు బోటువద్దకు చేరుకుని.. దానిని సరిచేయడానికి ప్రయత్నించారు. ఒడ్డున ఉన్న మత్స్యకారులు వారికి సహకరించారు. కాగా.. మోహనరావు ఆచూకీ కనిపించకపోవడంతో గాలించారు. చాతీమీద బలమైన దెబ్బ తగిలి.. అస్వస్థతకు గురైన మోహనరావును గుర్తించి.. ఒడ్డుకు చేర్చారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆయన మృతిచెందాడు. దీంతో భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులు, బంధువులు తీరప్రాంతానికి చేరుకుని విలపించారు. తోటి మత్స్యకారులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. మృతుడి కుటుంబ సభ్యులను జిల్లాపరిషత్ వైస్‌చైర్మన్ గుంటు విజయకుమార్, సర్పంచ్ హేమలత, టీడీపీ నాయకులు అప్పాజీ ఓదార్చారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వజ్రపుకొత్తూరు పోలీసులు, మత్స్యశాఖ డీడీ సుమలత, ఎఫ్‌డీవో ధర్మరాజుపాత్రో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సిద్దార్థ్ కుమార్ తెలిపారు.