అల.. మింగేసింది
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:09 AM
Fisherman dies after raft capsizes వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటకు చెందిన సూరాడ విశాఖ(58) అనే మత్స్యకారుడు.. గురువారం ఉదయం సముద్రంలో చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. విశాఖతోపాటు కొండ కూర్మారావు, వంక చిరంజీవులు మంచినీళ్లపేట తీరంలో చేపలవేటకు వెళ్లారు. అలల ఉధృతి కారణంగా వారు ప్రయాణిస్తున్న తెప్ప బోల్తా పడింది.
తెప్పబోల్తా పడి మత్స్యకారుడి మృతి
మంచినీళ్లపేటలో విషాదం
వజ్రపుకొత్తూరు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటకు చెందిన సూరాడ విశాఖ(58) అనే మత్స్యకారుడు.. గురువారం ఉదయం సముద్రంలో చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. విశాఖతోపాటు కొండ కూర్మారావు, వంక చిరంజీవులు మంచినీళ్లపేట తీరంలో చేపలవేటకు వెళ్లారు. అలల ఉధృతి కారణంగా వారు ప్రయాణిస్తున్న తెప్ప బోల్తా పడింది. ఆ ముగ్గురు చెల్లాచెదురై.. ఈదుకుంటూ తెప్పవద్దకు చేరుకున్నారు. తెప్పను తిరగేసి ఒడ్డుకు చేరుతున్న సమయంలో మరోసారి రాకాసి అల ఉధృతి పెరిగింది. దీంతో మళ్లీ ఆ ముగ్గురూ.. సముద్రంలోకి కొట్టుకుపోయారు. తెప్పవద్దకు ఈదుకుంటూ వస్తున్న సమయంలో సూరాడ విశాఖ ఆయాసం ఎక్కువై ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో విశాఖ మృతదేహాన్ని బయటకు తెచ్చారు. విశాఖ మృతితో భార్య దానమ్మ, ముగ్గురు పిల్లలు, బంధువులు బోరున విలపించారు. గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఎస్‌ఐ బి.నిహార్ సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మత్స్యశాఖ అధికారి నాగరాజు, మాజీ సర్పంచ్ గుల్ల చిన్నారావు తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
చేపలవేటకు వెళ్లి.. మత్స్యకారుడు సూరాడ విశాఖ మృతి చెందడం బాధాకరమని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు విచారం వ్యక్తం చేశారు. గ్రామపెద్దలు, మత్స్యకారులతో ఫోన్‌లో ఆయన మాట్లాడారు. సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.