మోగిన నగారా!
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:19 AM
స్థానిక ఎన్నికలకు నగరా మోగింది.
- స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్, షెడ్యూల్ జారీ
- ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలకు గ్రీన్సిగ్నల్
- శ్రీకాకుళం, ఆమదాలవలసలో బ్రేక్
- రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
- ఈ నెల 28న పోలింగ్
- నవంబరులో పంచాయతీలు, ఎంపీటీసీలకు..
- అమల్లోకి ఎన్నికల కోడ్
శ్రీకాకుళం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు నగరా మోగింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచా యతీల ఎన్నికలకు సంబంధించి బుధవారం నోటిఫికేషన్లు, షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఏపీఎస్ఈసీ) జారీ చేసింది. అయితే జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస పురపాలక సంఘంలో ఎన్నికలకు బ్రేక్ వేసింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకూ ఈ కోడ్ అమలులో ఉంటుంది.
అటు సందడి.. ఇటు నిరాశ
తాజా షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇచ్ఛాపురంలో 28 వార్డులకు, పలాస-కాశీబుగ్గలో 36 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే, శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస మున్సిపాలిటీకి సంబంధించి ముందస్తు ప్రక్రియ ఇంకా పూర్తి కానందున, ఈ రెండుచోట్ల ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించడం లేదని ఈసీ స్పష్టం చేసింది. దీంతో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘాల్లో సందడి నెలకొనగా, శ్రీకాకుళం, ఆమదాలవలస వాసుల్లో నిరాశ అలముకుంది.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్..
- అక్టోబరు 16 (శుక్రవారం): ఎన్నికల అధికారి ద్వారా వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శన, ఎన్నికల నోటీసు జారీ చేస్తారు. ఇదే రోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది.
-18న నామినేషన్ల దాఖలకు చివరి తేదీ. మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే.
- 19న నామినేషన్ల పరిశీలన (ఉదయం 11 గంటల నుంచి)
- 21న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ (మధ్యాహ్నం 3 గంటల తర్వాత)
- 28న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహణ.
- 30న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
-నవంబరు 5 లేదా 6న మున్సిపల్ చైర్పర్సన్లను ఎన్నుకునే పరోక్ష ఎన్నికలు
మూడు దశల్లో పంచాయతీ పోరు..
పట్టణ స్థానిక సంస్థలతో పాటు గ్రామీణ ప్రాంత ఎన్నికలకు కూడా ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 910 గ్రామ పంచాయతీలు, 538 ఎంపీటీసీ స్థానాలకు నవంబరులోనే ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఒకే విడతలో (సింగిల్ ఫేజ్) నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబరు 3న పోలింగ్ నిర్వహించి 5న ఫలితాలు ప్రకటిస్తారు.
- జిల్లాలోని 910 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో పొలింగ్ జరగనుంది.
-మొదటి దశ : నవంబరు 13న నోటిఫికేషన్ విడుదల, 26న పోలింగ్, కౌంటింగ్.
- రెండో దశ : నవంబరు 16న నోటిఫికేషన్ విడుదల, 29న పోలింగ్, కౌంటింగ్.
- మూడో దశ : నవంబరు 19న నోటిఫికేషన్ విడుదల, డిసెంబరు 2న పోలింగ్, కౌంటింగ్.