Share News

The Vamsadhara shutters scandal: ఇంకెన్నాళ్లు!

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:20 AM

The Vamsadhara shutters scandal: జిల్లాలో ఏదైనా శాఖాపరంగా పెద్ద అవినీతి జరిగిందంటే అది వంశధార షట్టర్ల కుంభకోణమే.

The Vamsadhara shutters scandal: ఇంకెన్నాళ్లు!
టెక్కలి సమీపంలో పాడైన కాలినడక వంతెన

- వంశధార షట్టర్ల కుంభకోణంపై కొనసాగుతున్న విచారణ

- రూ.73.80కోట్ల అవినీతి

- రెండు దశాబ్దాలవుతున్నా కొలిక్కిరాని కేసు

- కనీసం చార్జిషీట్‌ దాఖలు చేయని వైనం

టెక్కలి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏదైనా శాఖాపరంగా పెద్ద అవినీతి జరిగిందంటే అది వంశధార షట్టర్ల కుంభకోణమే. రెండు దశాబ్దాల కిందట వెలుగు చూసిన ఈ కుంభకోణం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. షట్టర్లు, కాలినడక వంతెనల సామగ్రి కొనుగోలులో వంశధార అధికారులు రూ.73.80కోట్ల అవినీతికి పాల్పడినట్లు అప్పటి హరిశ్చంద్రపురం, సోంపేట ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, గౌతు శివాజీల ఫిర్యాదుతో విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఇందులో 33మంది అధికారుల పాత్ర ఉందని గుర్తించి వారిని సస్పెండ్‌ చేశారు. ఈ కేసు వెలుగులోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయినా దర్యాప్తు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కనీసం చార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేయలేదు. దర్యాప్తు మాట అటుంచితే కోట్లాది రూపాయల విలువగల షట్టర్లు, వాక్‌వే బ్రిడ్జిలు తుప్పుపట్టి ప్రస్తుతం ఎందుకూ పనికిరాకుండా పోయాయి.

ఇదీ పరిస్థితి..

టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, హిరమండలం డివిజన్ల పరిధిలో వంశధార కాలువ లపై షట్టర్లు, కాలినడక వంతెనల ఏర్పాటుకు 2005-06 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం 2,036 పనులు చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు. వాక్‌వే వంతెనకు రూ.2లక్షల నుంచి రూ.6లక్షల వరకు, షట్టర్లకు సంబంధించి డయామీటర్‌ ప్రకారం రూ.50వేల నుంచి రూ.1.50లక్షల వరకు ఉండేటట్లు ధరలను నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లను ఆహ్వానించారు. అప్పట్లో టెండర్లు వేసిన వారికి, వంశధార ఇంజనీరింగ్‌ అధికారులకు మధ్య బేరసారాలు కుదరడంతో పెద్దఎత్తున ఇందులో అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు వినిపించా యి. దీనిపై అప్పటి ప్రతిపక్ష ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు కె.అచ్చెన్నాయుడు, జి.శివాజీ ఫిర్యాదుతో 2009లో విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో తీగలాగితే డొంక కదిలినట్లు అవినీతి కుంభకోణం బయటపడింది. 2011లో సీఐడీ విభాగానికి అప్పటి ప్రభుత్వం ఈ కేసును అప్పగించింది. ఈ మేరకు సీఐడీ అధికారులు టెక్కలి, కోటబొమ్మాళి, హిరమండలం, శ్రీముఖలింగం, సిటీపేట, నరసన్నపేట తదితర ప్రాంతాల్లోని వంశధార కార్యాలయాలు, గోదాముల్లో దర్యాప్తు నిర్వహించారు. షట్టర్ల విడి భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని వినియోగించారు, వాటి నాణ్యతా ప్రమాణాలు, ఏ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయి వంటి అంశాలపై విచారణ చేపట్టారు. ఈ అవినీతి మరక అంటిన 33మంది వంశధార ఇంజనీరింగ్‌ అధికారులను అప్పట్లో సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌కు గురైన వారిలో కొందరు ఇప్పటికే చనిపోగా, మరికొందరు పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. సీఐడీ అధికారుల దర్యాప్తు సైతం నేటికీ ఓ కొలిక్కి రాలేదు. అవినీతి వెలుగులోకి వచ్చి రెండు దశాబ్దాలు అయినా ఇప్పటికీ కనీసం చార్జ్‌షీట్‌ను దాఖలు చేయలేదు. ప్రస్తుతం కొన్ని షట్టర్లు, వాక్‌వే వంతెనలు తుప్పుపట్టి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇదిలా ఉండగా, వాక్‌వే బ్రిడ్జిలు, షట్టర్లను సరఫరాకు సంబంధించి తనకు వంశధార యంత్రాంగం ఇంకా రూ.32కోట్లు బకాయి పడిఉందని కాంట్రాక్టర్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై స్థానిక ఈఈ బి.శేఖరరావును వివరణ కోరగా.. ‘వంశధార షట్టర్ల కుంభకోణంపై అధికారులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా చార్జ్‌షీట్‌ కూడా పూర్తి కాలేదు.’అని అన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:21 AM