Share News

టూనా చేపలు వచ్చేశాయ్‌

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:24 AM

సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు టూనా చేపలు అధికంగా లభ్యమవుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 టూనా చేపలు వచ్చేశాయ్‌
తీరంలో లభించే టూనా చేపలు.

-మత్స్యకార వలలకు లభ్యం

-విదేశాల్లో అధిక డిమాండ్‌

టెక్కలి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు టూనా చేపలు అధికంగా లభ్యమవుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టూనా చేపను.. స్థానిక మత్స్యకారులు తుంబడం అని కూడా పిలుస్తారు. వీటికి విదేశాల్లో డిమాండ్‌ ఎక్కువ. ఈ చేపలతో ప్రత్యేకంగా ఫిష్‌రోల్స్‌, ఫ్రై ఇలా పలు రకాల వంటలు తయారుచేసి హోటల్స్‌లో సైతం విక్రయిస్తారు. ఈ చేపకు మధ్యలో ఒక ముల్లు.. దలసరి చర్మం ఉంటుంది. వీటిని తొలగించి పలు రకాల వంటకాలు చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ కిలో సుమారు రూ.200 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ చేపలను చైనా, జపాన్‌, యూకే, ఫ్రాన్స్‌, జర్మన్‌, సౌత్‌ ఏషియా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కేరళీయులు కూడా ఎక్కువగా టూనా చేపలను ఇష్టపడుతుంటారు. ఏటా ఈ సీజన్‌లో లభ్యమయ్యే టూనా చేపలకు విదేశాల్లో డిమాండ్‌ ఉన్నా.. స్థానికంగా కోల్డ్‌స్టోరేజీలు లేక తమకు ఇబ్బందులు తప్పడం లేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. జిల్లాలో రణస్థలం మండలం దోనిపేట నుంచి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వరకు 193 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. 11 మండలాలు 104 మత్స్యకార గ్రామాల్లో చేపల వేట సాగిస్తున్నారు. కానీ జిల్లాలో ఎక్కడా కోల్డ్‌స్టోరేజీ లేకపోవడంతో దళారులకు విక్రయించాల్సి వస్తోందని మత్స్యకారులు పేర్కొంటున్నారు. దళారీలు అరకొర ధరకు కొనుగోలు చేసి.. వీటిని విదేశాలకు తరలించి.. సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. టూనా చేపలు వేటాడాలంటే.. సముద్రంలో కనీసం 300 నాటికన్‌ మైళ్లు లోపలకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. సర్కిల్‌ హుక్‌ వలలు ద్వారా ఈ చేపల వేట కొనసాగిస్తామని చెబుతున్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:24 AM