Share News

వైసీపీని ముంచిన ఆ ముగ్గురు!

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:31 AM

The threat of cases spreading from Palasa to Amadalavalasa జిల్లాలో వైసీపీని ‘ఆ ముగ్గురూ’ పాతాళంలోకి నెట్టేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వీయ తప్పిదాలతో.. పార్టీ పరువును మరింత దిగజార్చారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ప్రతిపక్షం ఎలానూ లేదు.. భవిష్యత్తులో కూడా వచ్చే పరిస్థితి లేదంటూ పలువురు చర్చించుకుంటున్నారు.

వైసీపీని ముంచిన ఆ ముగ్గురు!

  • వరుస ఘటనలతో పార్టీ శ్రేణుల్లో కల్లోలం

  • పలాస నుంచి ఆమదాలవలసకు పాకిన కేసుల బెడద

  • ఆపై అంతర్గత విభేదాలు

  • ఇప్పటికీ ముహం చాటేస్తున్న తమ్మినేని

  • చింతాడ ఉదంతంతో మరింత అభాసుపాలు

  • శ్రీకాకుళం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైసీపీని ‘ఆ ముగ్గురూ’ పాతాళంలోకి నెట్టేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వీయ తప్పిదాలతో.. పార్టీ పరువును మరింత దిగజార్చారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ప్రతిపక్షం ఎలానూ లేదు.. భవిష్యత్తులో కూడా వచ్చే పరిస్థితి లేదంటూ పలువురు చర్చించుకుంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లావాసులు ఏకపక్షంగా కూటమిని గెలిపించారు. వైసీపీకి ప్రతిపక్షం దక్కకుండా చేసేశారు. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవి వైసీపీకి జీవన్మరణ సమస్య. కానీ తాజా సంఘటనల నేపథ్యంలో ఆ ముగ్గురి వల్ల వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని.. ఇప్పట్లో పార్టీ కోలుకుంటుందా... జనంలో కలిగిన అనుమానాలు నివృత్తి చేయగలమా అనేది వైసీపీ సీనియర్‌ నేతల్లో వ్యక్తమవుతోంది.

  • పలాసలో బైక్‌ ప్రమాదంలో తన కుమారుడ్ని తప్పించాలని భావించి.. వరుస తప్పిదాలతో తన మెడకు చుట్టుకున్న వైసీపీ మాజీమంత్రి సీదిరి అప్పలరాజుతో జిల్లాలో జ్యుడిషియల్‌ రిమాండ్‌ ఆరంభమైంది. ఆ తర్వాత బయటపడిన మాజీ స్పీకర్‌ తమ్మినేని భూ వ్యవహారం.. బతికున్నవారిని కాగితాల్లో చనిపోయారని చూపించి అక్రమ రిజిస్ట్రేషన్‌పై జిల్లా పోలీసు శాఖ లోతుగా దర్యాప్తు చేశారు. కేసు వివరాలను వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికీ మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. నేరుగా ప్రజలకు మొహం చూపలేని దుస్థితి ఏర్పడింది. ఆ కొద్దిరోజుల గ్యాప్‌లోనే చింతాడ రవికుమార్‌, మరో 27 మంది వైసీపీ కార్యకర్తలు.. జగన్‌ పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న మహిళా ఎస్‌ఐ పట్ల వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఈ మూడు ఘటనలతో.. ఆ ముగ్గురి వల్ల పార్టీ మరింత బలహీనమైందన్నది వాస్తవం. వారు చేసిన తప్పిదాల వల్ల ఇప్పట్లో పార్టీ మనుగడ సాధించే పరిస్థితి లేదని పలువురు నాయకులు, కార్యకర్తలు మదనపడుతున్నారు.

  • గ్రూపుల బెడద...

  • మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు వైసీపీలోనే కొరగాని కొయ్య మాదిరిగా తయారయ్యాడు... ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌. తమ్మినేని కొద్దిరోజుల అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఒక్క మాట కూడా అనుకూలంగా ప్రకటన చేయలేదు చింతాడ, అతని అనుచరులు. ఇప్పుడు చింతాడ రవికుమార్‌, అతని అనుచరులకు కూడా తమ్మినేని నుంచి ఏవిధమైన పలకరింపులు, పరామర్శలు లేవు. మరోవైపు జిల్లాలో వైసీపీ సీనియర్‌ నేతలు ధర్మాన సోదరులు కూడా తమ్మినేని కుటుంబాన్ని పరామర్శించలేదు. కానీ చింతాడ రవికుమార్‌ను మాత్రం జైలుకు వెళ్లి పరామర్శించారు. అంతకుముందు అతనికి అనుకూలంగా ప్రకటనలు చేశారు. సీదిరి అప్పలరాజు మంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీలోనే గ్రూపుల బెడద తీవ్రంగా ఉండేది. అప్పటి సీఎం జగన్మోహనరెడ్డి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ గ్రూపు సీదిరికి వ్యతిరేకంగా పనిచేసి గట్టిగానే దెబ్బకొట్టారు. ఇక ఆమదాలవలస నియోజకవర్గంలోని వైసీపీలో తమ్మినేని, చింతాడ వేర్వేరు వర్గాలు ఏర్పడ్డాయి. రెండు గ్రూపులుగా కార్యకర్తలు మారారు. పలాస నుంచి ఆమదాలవలస నియోజకవర్గానికి కేసుల బెడద పాకింది.

  • నాయకుల మధ్య సమన్వయలోపం

  • శ్రీకాకుళం నియోజకవర్గంతో మొదలై.. ఇతర ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ నాయకుల్లో సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనం... ఇటీవల ఆ పార్టీ పిలుపునిచ్చిన డీఎస్సీపై నిరసన కార్యక్రమం. ఆ కార్యక్రమంలోనూ పేలవంగానే కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నాయకులే పూలదండలు వేసుకుని.. మరీ నిరసనలో పాల్గొన్నారు. జగన్‌ అండ్‌కో రాష్ట్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న విషయంలో చదువుకున్న యువతను భాగస్వామ్యం చేసుకోలేకపోయారు. జగన్‌ పర్యటనలో చోటుచేసుకున్న ఘటనల్లో ఇప్పటికే కేసు నమోదైన ఘటనలో తామెక్కడ అరెస్టవుతామోనని సంశయం చెందుతున్నారు. పైకి చెప్పుకోలేక జాగ్రత్త వహిస్తూ.. పైపైనే పార్టీ కార్యక్రమాలు ‘మమ’ అనిపించేస్తున్నారు. సాధారణ ప్రజలు, తటస్థ ఓటర్లు.. తాజా మార్పులను.. వైసీపీ తప్పిదాలను క్షుణ్నంగా గమనిస్తున్నారు. వైసీపీ నాయకులకు ఇంకా గుణపాఠం కలగలేదని చర్చించుకుంటున్నారు.

Updated Date - Aug 12 , 2026 | 12:31 AM