పాలకవర్గం కొలువుదీరే వేళాయె!
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:43 PM
మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయనుంది. దీని కోసం మున్సిపల్ కార్యాలయాన్ని అధికారులు ముస్తాబు చేయిస్తున్నారు.
-మున్సిపల్ కార్యాలయం ముస్తాబు
పలాస, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయనుంది. దీని కోసం మున్సిపల్ కార్యాలయాన్ని అధికారులు ముస్తాబు చేయిస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేస్తుండగా కార్యాలయాన్ని రూ.కోటి నిధులతో ఆధునీకరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఇ.శ్రీనివాసులు తెలిపారు. 25 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో ఇప్పటి వరకూ నాలుగు పాలకవర్గాలు కొలువైన ఘన చరిత్ర ఉంది. ప్రస్తుతం కార్యాలయానికి రంగులు లేకపోవడంతో పురాతన భవనంలా కనిపిస్తోంది. సమావేశ మందిరంలో కూడా అనేక పరికరాలు మరమ్మతులకు గురికావడం... చాలినంతగా బెంచీలు లేకపోవడంతో వాటిని తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో 31 మంది కౌన్సిలర్లు, ముగ్గురు కోఆప్షన్ సభ్యులకు సరిపడా బెంచీలు ఉండేవి. కొత్తగా ఐదుగురు కౌన్సిలర్లు పెరగడంతో గదిని తీర్చిదిద్దే చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాదికి మొత్తం కార్యాలయాన్ని ఆధునికీకరించి... పాలకులకు అందిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.