మూడోసారి
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:16 AM
Annadata Sukhibhav funds released today ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి.. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు శుక్రవారం జమ చేయనుంది. ‘పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ’ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన రైతుల ఖాతాల్లో ఏడాదికి మూడు విడతలుగా మొత్తం 20వేలు చొప్పున జమ చేయనున్నట్టు ఎన్నికల్లో హామీ ఇచ్చారు.
నేడు అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల
జిల్లాలో 2,79,100 మంది రైతుల ఖాతాల్లో రూ.156.31 కోట్లు జమ
నియోజకవర్గాల్లో సభలకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు
నరసన్నపేట, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి.. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు శుక్రవారం జమ చేయనుంది. ‘పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ’ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన రైతుల ఖాతాల్లో ఏడాదికి మూడు విడతలుగా మొత్తం 20వేలు చొప్పున జమ చేయనున్నట్టు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ మేరకు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమచేసింది. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం జిల్లాలోని 2,79,100 రైతులకు రూ.156.31 కోట్లు జమ చేయనున్నాయి. ఇందులో పీఎం కిసాన్ పథకం కింద 22వ విడతగా 2,23,350 మంది రైతులకు రూ.44.67 కోట్లు జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2,79,100 మంది రైతులకు రూ.111.64 కోట్లు పంపిణీ చేయనుంది.
నియోజకవర్గాలవారీ పరిశీలిస్తే.. ఇచ్ఛాపురంలో 30,634 మంది రైతులకు రూ.16.65 కోట్లు, పలాసలో 29,748 మంది రైతులకు రూ.16.62 కోట్లు, టెక్కలిలో 41,961 మంది రైతులకు రూ.24.28 కోట్లు, నరసన్నపేట లో 37,741మంది రైతులకు రూ.20.94 కోట్లు పంపిణీ చేయనున్నారు. శ్రీకాకుళం నియోజవర్గంలో 20,737 మంది రైతులకు రూ.11.34 కోట్లు, ఎచ్చెర్లలో 48,103 మంది రైతులకు రూ.26.76 కోట్లు, పాతపట్నంలో 37,124 మంది రైతులకు రూ.21.08 కోట్లు, ఆమదాలవలసలో 33,052 మంది రైతులకు రూ.18.64 కోట్లు జమ కానున్నాయి. ఈ మేరకు నియోజవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, కీలక ప్రజాప్రతినిధులతో సభలతోపాటు రైతుసేవాకేంద్రం స్థాయిలో రైతులతో సమావేశాల నిర్వహణకు వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.