ఈదురుగాలుల బీభత్సం
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:22 AM
మండలంలోని గెడ్డకంచరాంలో బుధవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు పశువుల శాల రేకు ఎగిరిపడి గ్రామానికి చెందిన నక్క సూరప్పడు (58) అక్కడికక్కడే మృతి చెందాడు.
-పశువులశాల రేకు ఎగిరిపడి వృద్ధుడి మృతి
-మరో మహిళకు తీవ్ర గాయాలు
- గెడ్డకంచరాంలో విషాదం
జి.సిగడాం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గెడ్డకంచరాంలో బుధవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు పశువుల శాల రేకు ఎగిరిపడి గ్రామానికి చెందిన నక్క సూరప్పడు (58) అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన నక్క మంగమ్మకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేర్వేరు రైతు కుటుంబాలకు చెందిన సూరప్పడు, మంగమ్మలు పశువులను మేతకు తోలుకెళ్లారు. సాయంత్రం తీవ్ర గాలివాన మొదలుకావడంతో తిరిగి ఇంటికి పయనమయ్యారు. గ్రామంలోకి చేరుకుంటుండగా ఓ పశువుల శాల రేకులు ఎగిరి మీద పడటంతో సూరప్పడు రెండుకాళ్లు సగానికి తెగిపోయాయి. తీవ్ర రక్తస్రావంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మంగమ్మపై కూడా పశువుల శాల రేకులు పడి తీవ్రగాయాలపాలైంది. ఆమెను చికిత్స కోసం విజయనగరం జిల్లా రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పిడుగుపాటుకు
మహిళకు అస్వస్థత
సీతంపేట గ్రామానికి చెందిన పార్వతీ అనే మహిళ బుధవారం పిడుగుపాటుకు గురై అస్వస్థతకు గురైంది. పార్వతీ తన ఇంటికి నడుచుకొని వస్తుండంగా గేదెలపేటకాలనీ సమీపంలో కనకదుర్గ ఆలయం వద్ద పిడుగుపడింది. దీంతో ఆ శబ్దానికి స్పృహకోల్పోయిన ఆమెను చికిత్స నిమిత్తం స్థానికులు రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రసుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని. పెద్ద ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు.