టేకుచెట్లు ఎండిపోతున్నాయ్
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:16 AM
మెట్ట, గిరిజన ప్రాంతాల్లో టేకుచెట్లకు తెగుళ్లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- వెంటాడుతున్న తెగుళ్ల భయం
- కీటకం ఆశించడంతో రంగుమారిన ఆకులు
- ఆందోళనలో రైతులు
టెక్కలి రూరల్, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): మెట్ట, గిరిజన ప్రాంతాల్లో టేకుచెట్లకు తెగుళ్లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలామంది రైతులు టేకుచెట్ల పెంపకం ద్వారా ఆదాయం పొందేవారు. తితలీ తుఫాన్ సమయంలో 2018లో.. గాలివాన బీభత్సనికి చాలాచోట్ల టేకుచెట్ల నేలకొరిగాయి. వాటిస్థానంలో రైతులు మళ్లీ మొక్కలు నాటి పెంపకం చేపట్టారు. ప్రస్తుతం అవి పెద్ద చెట్లు కాగా.. ఈ సమయంలో వాటికి స్కెల్లో నైజర్ కీటకం(లార్వా) ఆశించడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ తెగుళ్ల ప్రభావంతో ఆకులు రంగుమారి... రాలిపోయి.. చెట్లు ఎండిపోతున్నాయని వాపోతున్నారు.
జిల్లాలో సుమారు పదివేల ఎకరాల్లో టేకుచెట్లు పెంపకం చేపడుతున్నారు. కొంతమంది రైతులు జీడి, మామిడితోటల చుట్టూ టేకు చెట్లు పెంచుతూ.. వాటిద్వారా ఆదాయం పొందుతున్నారు. మెళియాపుట్టి మండలంలోని మర్రిపాడు, బందపల్లి, వెంకటాపురం, భరణికోట, కేరాశింగి, గొడ్డ, కరజాడ, దీనబందుపురం, జాడుపల్లి, బాణాపురం వంటి గ్రామాల్లో అధికంగా టేకుచెట్లు పెంచుతున్నారు. టెక్కలి మండలంలో నర్సింగపల్లి, ముఖలింగాపురం, గూడేం, సీతాపురం, లింగాలవలస, భీంపురం వంటి ప్రాంతాల్లో టేకు తోటలు అధికంగా ఉన్నాయి. కొత్తూరు, హిరమండలం, నందిగాం, మందస, కవిటి, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాల్లోనూ టేకు చెట్ల పెంపకం చేపడుతున్నారు. వీటితోపాటు అటవీశాఖకు చెందిన టేకు మొక్కలను కూడా పెంచుతున్నారు. టేకు మొక్కలు నాటిన పదేళ్లలోపు చెట్లుగా పెరిగి ఆదాయం వస్తుంది. కాగా.. ప్రస్తుతం తెగుళ్ల కారణంగా ఆదాయం వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో వరి సాగు ఆశాజనకంగా లేదని పేర్కొంటున్నారు. టేకు చెట్లు కూడా నష్టపోతే తమ జీవనం ఎలా అని మదనపడుతున్నారు. అధికారులు స్పందించి తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
వాతావరణం ప్రభావం వల్లే
టేకుచెట్ల ఆకుల్లో పత్రహరితాన్ని కీటకాలు తినేస్తున్నాయి. దీంతోపాటు వాతావరణం ప్రభావం వల్ల ఆకులు ఎండిపోతున్నాయి. వీటి నమూనాలు సేకరించి వ్యవసాయ శాస్త్రవేత్తలకు పంపించాం. ఈ కీటకాల నివారణకు క్లోరోపైరిఫాస్ మందును 2 ఎంఎల్.. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- దుక్క శరత్రెడ్డి, ఉద్యానవనశాఖ అధికారి