లక్ష్యం 80 వేలు..పెట్టింది 2 వేలు!
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:56 PM
జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకానికి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు.
-జిల్లాలో నత్తనడకన సోలార్ ప్లాంట్లు
- పెద్దగా ఆసక్తిచూపని ప్రజలు
- ఇదీ సూర్యఘర్ పథకం తీరు
ఇచ్ఛాపురం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకానికి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటిపై సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నా ప్రజలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొన్ని గ్రామాలను ఎంపికచేసి శతశాతం సోలార్ ప్లాంట్లు ఏర్పాటయ్యేలా అధికారులు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 80 వేల సోలార్ ప్లాంట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాదిన్నర కాలంలో 2 వేల ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. బ్యాంకుల సహకారం లేక.. ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్‌లో జాప్యం, ఏజెన్సీలు సక్రమంగా సేవలందించకపోవడం వంటి కారణాలతో సూర్యఘర్ పథకంపై ప్రజలు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఒక్క శాతం కూడా ముందుకు రాలే..
జిల్లాలో విద్యుత్ శాఖకు సంబంధించి శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్లు ఉన్నాయి. మొత్తం 8,05,204 గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఉండగా, కనీసం ఒక్క శాతం కూడా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రాలేదంటే జిల్లాలో పరిస్థితి ఇట్టే అర్ధమవుతోంది. సోలార్ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఉంది. విద్యుత్ రూపంలో రాయితీ ఖర్చు తగ్గడం, కాలుష్యరహిత సమాజం, సంప్రదాయ ఇంధన వనరుల సామర్థ్యం పెంచడం కోసం కేంద్రం నజరానాలను ప్రకటించింది. శతశాతం సోలార్ వినియోగించుకునే పంచాయతీలకు ఏకంగా రూ.కోటి పారితోషికం అందించేందుకు ముందుకొచ్చింది. ఏడాది కిందట 5 వేల జనాభా ఉన్న గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు. గత ఏడాది సెప్టెంబరులోగా ప్రతి ఇంటిపైతో పాటు ప్రాంగణంలో సోలార్ ప్లాంట్లు ఉండేలా చూడాలని చూశారు. కానీ లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. అధికారులు ఎంతలా ఒత్తిడి తెచ్చి అవగాహన కల్పిస్తున్నా.. ప్రయోజనం లేకుండా పోతోంది. చివరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచితం, మహిళా సంఘ సభ్యులకు ప్రాధాన్యం ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. డాబాలు లేకపోయినా.. ఖాళీ స్థలాల్లో సోలార్ పలకల ఏర్పాటుకు అవకాశమిచ్చినా ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సూర్యఘర్ పథకంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. పేద, మధ్యతరగతి వర్గాలకు విద్యుత్ బిల్లుల భారం నుంచి తప్పించుకునేందుకు సోలార్ పలకలు ఏర్పాటు చేసుకోవాలని పెద్ద ఎత్తున అవగాహన కల్పించింది. సూర్యఘర్ పథకంలో భాగంగా మూడు కిలోవాట్ల పథకానికి సంబంధించి రూ.78 వేల వరకూ సాయం అందించనుంది. ఈ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే ఇంటి అవసరాలకుపోను విద్యుత్ మిగిలి ఉంటే అమ్ముకోవచ్చు. డిస్కంలే కొనుగోలు చేసి ఆ నగదును లబ్ధిదారుడికి అందిస్తాయి. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు మాత్రం ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అవగాహన పెంచుతున్నాం..
విద్యుత్ శాఖపరంగా ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ప్రజలు ముందుకు రావడం లేదు. సోలార్ ప్లాంట్లతో ఎంతో ప్రయోజనం. విద్యుత్ భారం తగ్గుతుంది. సంప్రదాయ ఇంధన వనరును వినియోగించుకోవచ్చు.
-కృష్ణమూర్తి, ఎస్‌ఈ, విద్యుత్ శాఖ, శ్రీకాకుళం