లెక్క తేలింది ‘సర్’
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:20 AM
Collection of details of 1.72 lakh voters fails ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) ప్రక్రియలో భాగంగా జిల్లాకు సంబంధించిన విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. బూత్‌లెవల్ అధికారులు చేపట్టిన ఇంటింటి సర్వేలో జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున బోగస్, మరణించిన, వలస వెళ్లిన ఓటర్లను గుర్తించారు.
జిల్లాలో మొత్తం ఓటర్లు 18,97,405
78 వేల మందికి పైగా మృతులు.. 44 వేల మంది శాశ్వత వలస
రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు 32,556 మంది
1.72 లక్షల మంది ఓటర్ల వివరాల సేకరణ విఫలం
31న ముసాయిదా జాబితా..
శ్రీకాకుళం, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) ప్రక్రియలో భాగంగా జిల్లాకు సంబంధించిన విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. బూత్‌లెవల్ అధికారులు చేపట్టిన ఇంటింటి సర్వేలో జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున బోగస్, మరణించిన, వలస వెళ్లిన ఓటర్లను గుర్తించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 18,97,405 మంది ఓటర్లు ఉన్నారు. బీఎల్‌వోల ఇంటింటి సర్వేలో 7,11,693 మంది(37.51 శాతం) ఓటర్లను నేరుగా ధ్రువీకరించారు. 9,82,274 మందిని(51.77 శాతం) వారి కుటుంబ సభ్యుల ద్వారా ఽధ్రువీకరించారు. మరో 30,929 మంది(1.63 శాతం) ఓటర్లకు సంబంధించి ఎలాంటి మ్యాపింగ్ జరగలేదు. వివిధ కారణాల వల్ల జిల్లాలో మొత్తం 1,72,509 (9.09 శాతం) మంది ఓటర్ల వివరాలను బీఎల్‌ఓలు సేకరించలేకపోయారు. ఈ జాబితాలో అత్యధికంగా 78,482 మంది (4.14 శాతం) ఓటర్లు మరణించినట్లు గుర్తించారు. 44,956 మంది(2.37 శాతం) తమ నివాస ప్రాంతాల నుంచి శాశ్వతంగా వలస వెళ్లిపోయారు. రెండు చోట్ల ఓటు నమోదైన వారు జిల్లాలో 32,556 మంది (1.72శాతం) ఉన్నారు. ఆచూకీ లేని వారు 16,444 మంది(0.87 శాతం) ఉండగా, వివరాలు ఇవ్వడానికి నిరాకరించిన వారు 71 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 85,275 (4.49 శాతం) ఓట్లలో లోపాలు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
రాజకీయ పార్టీలకు జాబితాలు...
వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14తో ముగియాల్సిన బీఎల్‌ఓల ఇంటింటి సర్వేను రాజకీయ పార్టీలు, సీఈఓ విజ్ఞప్తి మేరకు 10 రోజుల పాటు (ఈ నెల 24 వరకు) పొడిగించారు. ఈ సర్వేలో వివరాలు సేకరించలేకపోయిన (మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన, రెండు చోట్ల నమోదైన) ఓటర్ల జాబితాలను డీఈఓలు, ఈఆర్‌ఓలు లేదా బీఎల్‌ఓలు స్థానిక రాజకీయ పార్టీలకు, బూత్ లెవల్ ఏజెంట్లకు అందజేయనున్నారు. పారదర్శకత కోసం ఈ వివరాలను సీఈఓ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఉంచనున్నారు.
అభ్యంతరాలకు నెల రోజుల గడువు..
క్షేత్రస్థాయి సర్వే వివరాల ఆధారంగా అర్హులందరికీ అవకాశం కల్పిస్తూ ఈ నెల 31న ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ఈ జాబితాలో పేర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలపై ప్రజలు ఎవరైనా అభ్యంతరాలు దాఖలు చేసుకునేందుకు ఆగస్టు 30 వరకు అవకాశం కల్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు.