ఐక్యత మంత్రాంగం... అదే విజయ రహస్యం
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:24 AM
Victory through coordination కూటమి శ్రేణుల ఐక్యతతో.. పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలు టీడీపీ కైవసమయ్యాయి. మునిసిపల్ ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పనిచేయడంతో రెండుచోట్లా చైర్‌పర్సన్ స్థానాలతోపాటు.. 50 వార్డులు కూటమికి దక్కాయి. వైసీపీకి మాత్రం ఈ ఎన్నికలు తీవ్ర పరాభవాన్ని మిగిల్చాయి. అభ్యర్థుల ఎంపికలో వైఫల్యాలు.. అనాలోచిత నిర్ణయాలు.. ఆ పార్టీ కి అపజయాన్ని మూటకట్టాయి.
కూటమిలో సమన్వయంతోనే గెలుపు
పలాస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో భారీ మెజార్టీ
వైసీపీని కొంపముంచిన నిర్ణయాలు
మనస్ఫూర్తిగా పనిచేయని నేతలు
అభ్యర్థుల ఎంపికలోనూ వైఫల్యాలు
పలాస/ ఇచ్ఛాపురం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి):
కూటమి శ్రేణుల ఐక్యతతో.. పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలు టీడీపీ కైవసమయ్యాయి. మునిసిపల్ ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పనిచేయడంతో రెండుచోట్లా చైర్‌పర్సన్ స్థానాలతోపాటు.. 50 వార్డులు కూటమికి దక్కాయి. వైసీపీకి మాత్రం ఈ ఎన్నికలు తీవ్ర పరాభవాన్ని మిగిల్చాయి. అభ్యర్థుల ఎంపికలో వైఫల్యాలు.. అనాలోచిత నిర్ణయాలు.. ఆ పార్టీ కి అపజయాన్ని మూటకట్టాయి.
ఇచ్ఛాపురం నియోజకవర్గం.. టీడీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీకి కంచుకోట. కానీ మునిసిపాలిటీలో టీడీపీ ఒక్కసారి మాత్రమే అధికారంలోకి వచ్చింది. 1995లో కాళ్ల వెంకట లక్ష్మి టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా గెలిచారు. తరువాత మునిసిపాల్టీ టీడీపీకి చిక్కలేదు. ఎట్టకేలకు ఆ లోటు తీరింది. ప్రస్తుతం మునిసిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి ఆశి లీలారాణి ఘన విజయం సాధించారు. అటు వార్డుల్లోనూ కూడా కూటమి అభ్యర్థులు సంపూర్ణ విజయం కనబరిచారు. మొత్తం 28 వార్డులకుగానూ.. 19 స్థానాలు దక్కించుకున్నారు. వైసీపీ ఏడు స్థానాలకే పరిమితం కాగా.. మిగిలిన రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. కాగా.. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల శ్రేణుల సమన్వయంతో కూటమికి భారీ మెజార్టీ సాధ్యమైంది. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, స్థానిక ఎమ్మెల్యే, విప్ బెందాళం అశోక్ మూడు పార్టీల్లో ప్రధాన సామాజికవర్గాల్లో సమన్వయం కుదిర్చేలా చర్యలు చేపట్టారు. రైల్వే ఫ్లైఓవర్లు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా కూటమి అభ్యర్థులవైపు మొగ్గు చూపించారు.
వైసీపీలో సమన్వయం కరువు..
వైసీపీ ఆది నుంచి ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. నియోజకవర్గ నేతల్లో విభేదాలు కొంపముంచాయి. కొంతమంది నేతల సహాయ నిరాకరణ స్పష్టంగా కనిపించింది. పైగా ఒకే కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం అసంతృప్తికి కారణమైంది. అంతకుముందు మునిసిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడే పిలక రాజ్యలక్ష్మి.. నియోజకవర్గ బాధ్యతల కోసం ప్రయత్నాలు చేయడం మిగతా నేతలకు దూరం కావాల్సి వచ్చింది. పైగా మూడోసారి ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడంతో మెజార్టీ కేడర్‌కు రుచించలేదు. వాస్తవానికి వైసీపీ మాదిరిగానే టీడీపీలో ఆశావహులు అధికం. కానీ ఆ పార్టీ హైకమాండ్ ఐవీఆర్‌ఎస్ సర్వే చేపట్టి కేడర్‌తో పాటు పట్టణ ప్రజల నుంచి రహస్యంగా అభిప్రాయాలు సేకరించింది. ఆపై విప్ అశోక్‌బాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, జనసేన నేత దాసరి రాజు, బీజేపీ జిల్లా నాయకత్వం ఏకతాటిపైకి వచ్చి అభ్యర్థల ఎంపికలో కలుగజేసుకున్నాయి. ఫలితంగా అసంతృప్తి చల్లారింది. కానీ వైసీపీలో ఏకపక్షంగా వ్యవహరించడంతో ఈ ఎన్నికల్లో చేదు అనుభవం మిగిలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పలాసలోనూ..
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో కూటమి ధర్మాన్ని పాటించి 36వార్డులకు గాను జనసేనకు ఐదు, బీజేపీకి ఒక స్థానాన్ని కేటాయించారు. మిగిలిన 30 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు. దీనిపై జనసేన పార్టీలో ఓ వర్గం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా మెజార్టీ నాయకులు దీనికే కట్టుబడి అనుకున్న స్థానాలు పొందారు. కూటమి నాయకులంతా ఐక్యతతో కలియతిరిగి వార్డుల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఫలితంగా కూటమికి చైర్‌పర్సన్ స్థానంతోపాటు 31 వార్డులు దక్కాయి. వైసీపీ నాలుగు వార్డులకే పరిమితం కాగా.. మరొక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఎమ్మెల్యే గౌతు శిరీష, చైర్మన్ అభ్యర్ధి వజ్జ గంగాభవాని, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు ప్రచార బాధ్యతతోపాటు గెలుపొందే బాధ్యత తమ భుజస్కందాలపై వేసుకొని శ్రమించారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌లు కూడా రోడ్‌షోలు నిర్వహించి కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారు.
ఐదేళ్ల నిర్లక్ష్య ఫలితమే..
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో.. వైసీపీ ఐదేళ్ల పురపాలనలో నిర్లక్ష్యంగా పనులు గాలికి విడిచిపెట్టడంతోనే.. ప్రస్తుతం కూటమి విజయానికి దోహదం చేసిందనే వాదన వినిపిస్తోంది. అప్పట్లో అధికారం ఉండడంతో బలవంతపు ఏకగ్రీవాలు, బెదిరింపులకు పాల్పడి ఏదోఒక విధంగా మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. కానీ ఐదేళ్ల పాలనలో తాగునీటి సరఫరా, కాలువల నిర్వహణ తదితర అభివృద్ధి పనులు కనీసం చేపట్టలేదు. వైసీపీలో కొంతమంది బడా నాయకులు మున్సిపాలిటీని నాలుగు విభాగాలుగా విభజించి పాలన సాగించారు. పేరుకు చైర్మన్ పదవి ఉన్నా ఆయనను డమ్మీ చేసేశారనే విమర్శలున్నాయి. మరోవైపు. భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు తప్ప.. ఇతర అభివృద్ధి పనులు చేయలేదన్న అపవాదు ఉంది.
రెండున్నరేళ్ల కిందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా గౌతు శిరీఫ బాధ్యతలు చేపట్టిన తరువాత ముందుగా తాగునీటి సమస్యలు పరిష్కరించారు. ఉద్దానం రక్షితనీటి పథకాన్ని యుద్ధ ప్రాతిపదిక అమలు చేసి తాగునీరు అందించారు. ఈ రెండున్నరేళ్ల పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి చేసి ఓటెయ్యాలని ఎమ్మెల్యే, కేంద్రమంత్రితో సహా అభ్యర్థులు కోరారు. ప్రజలు వీరిపై పూర్తి నమ్మకం పెట్టుకొని కూటమికి ఓటేశారన్నది స్పష్టమవుతోంది.