తీరు మారదు.. సాగునీరు రాదు
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:11 AM
‘Vamsadhara’ fails to reach outlying areas వంశధార అధికారుల నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలతో శివారు ప్రాంతాల రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శివారు ప్రాంతాలకు అందని ‘వంశధార’
మంత్రి అచ్చెన్న ఆదేశాలు బేఖాతరు
సముద్రంలోకి వృథాగా 1,444 క్యూసెక్కులు
అధికారులను నిలదీస్తున్న రైతులు
టెక్కలి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): వంశధార అధికారుల నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలతో శివారు ప్రాంతాల రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం గొట్టాబ్యారేజీలోకి 3,668 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. వంశధార ప్రధాన ఎడమ కాలువ ద్వారా 2,450 క్యూసెక్కుల సాగునీరు రావాల్సి ఉంది. కానీ అధికారులు 1,600 క్యూసెక్కుల నీరు మాత్రమే విడిచిపెట్టడం మరింత ఆందోళన కలిగిస్తోంది. శివారు ప్రాంతాలైన టెక్కలికి 400 క్యూసెక్కులు, పలాసకు కనీసం 50 క్యూసెక్కుల సాగునీరు కూడా రాని పరిస్థితి నెలకొంది. సముద్రంలోకి సుమారు 1,444 క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతానికి సాగునీరు రావడం లేదని ఇప్పటికే పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతోపాటు రైతులు టెక్కలి డివిజన్ వంశధార అధికారులను నిలదీస్తున్నారు. గత నెల 6న వంశధార కాలువల వెంబడి సాగునీరు విడిచిపెట్టగా, 12వ తేదీ నాటికే పలాసకు చేరుకుంది. 14న సారవకోట మండలం గుమ్మపాడు, అక్కివలస పరిధిలో(16వ కిలోమీటరు సమీపంలో) వంశధార కాలువకు గండి పడింది. ఈ నేపథ్యంలో 1,600 క్యూసెక్కులు దాటి నీరు వదిలితే మరోసారి గండి పడుతుందని వంశధార అధికారులు భయపడుతున్నారు.
మంత్రి చెప్పినా.. అంతేనా
ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని మంత్రి అచ్చెన్న ధ్వజమెత్తారు. గొట్టాబ్యారేజీ నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని కాలువల ద్వారా మళ్లించి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చూడాలని వంశధార అధికారులను పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. కాగా.. సున్నా నుంచి 55వ కిలోమీటరు వరకు నరసన్నపేట డివిజన్ పరిధిలో ప్రధాన ఎడమకాలువ పనులు సరిగ్గా లేకపోవడం ఈ పరిస్థితికి దాపురించింది. గతంలో కూడా సుమారు రూ.4కోట్ల నిధులతో పనులు చేసినా కాలువ వెంబడి పూర్తి సామర్ధ్యంతో సాగునీరు రావడం లేదు. ఈ విషయమై వంశధార ఈఈ శేఖరరావు వద్ద ప్రస్తావించగా తన డివిజన్‌కు కేవలం 415 క్యూసెక్కుల సాగునీరు మాత్రమే వస్తుందని, ఆ నీటిని కొంతమేరకు రైతులకు అందజేస్తున్నామని తెలిపారు.
రైతులకు సమస్య రాకూడదు : మంత్రి అచ్చెన్న
ఖరీప్ సీజన్‌లో రైతులకు సమస్య లేకుండా సాగునీరు, ఎరువులు సరఫరాను సక్రమంగా చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నీటిపారుదల, వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘రైతుల ప్రయోజనాల దృష్ట్యా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. శివారు ఆయకట్టు రైతులకు తొలి ప్రాధాన్యంగా సాగునీరు అందించాలి. కొన్ని ప్రాంతాల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీనిపై అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎరువుల కొరత లేకుండా, పారదర్శకంగా పంపిణీ ప్రక్రియ చేపట్టాల’ని ఆదేశించారు.