Share News

అర్ధరాత్రి మారిన సీన్‌

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:19 AM

Palasa Vice-Chairman post allocated to Jana Sena పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ వైస్‌చైర్మన్‌ పీఠం కేటాయింపుపై ఆదివారం అర్ధరాత్రి సీన్‌ మారిపోయింది. తొలుత టీడీపీకి ఖరారైన ఈ సీటును.. జనసేనకు కేటాయిస్తున్నట్టు రాత్రివేళ ప్రకటన విడుదలైంది. దీనిపై టీడీపీ కౌన్సిలర్లు మనస్తాపం చెందగా.. సోమవారం జరగాల్సిన వైస్‌చైర్మన్‌ ఎన్నిక.. మంగళవారానికి వాయిదా పడింది.

అర్ధరాత్రి మారిన సీన్‌
పలాసలో వైస్‌చైర్మన్‌ ఎన్నిక లేకపోవడంతో బోసిపోయిన సభాప్రాంగణం

  • పలాస వైస్‌చైర్మన్‌ పీఠం జనసేనకు కేటాయింపు

  • టీడీపీ కౌన్సిలర్లు మనస్తాపం

  • వైస్‌చైర్మన్‌ ఎన్నిక నేటికి వాయిదా

  • పలాస, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ వైస్‌చైర్మన్‌ పీఠం కేటాయింపుపై ఆదివారం అర్ధరాత్రి సీన్‌ మారిపోయింది. తొలుత టీడీపీకి ఖరారైన ఈ సీటును.. జనసేనకు కేటాయిస్తున్నట్టు రాత్రివేళ ప్రకటన విడుదలైంది. దీనిపై టీడీపీ కౌన్సిలర్లు మనస్తాపం చెందగా.. సోమవారం జరగాల్సిన వైస్‌చైర్మన్‌ ఎన్నిక.. మంగళవారానికి వాయిదా పడింది. వైస్‌చైర్మన్‌గా సీనియర్‌ టీడీపీ నాయకుడు, జిల్లా వాణిజ్యవిభాగం అధ్యక్షుడు టంకాల రవిశంకర్‌గుప్తాను ఎన్నికల సమయంలోనే అధిష్ఠానం ప్రకటించింది. వైశ్యసామాజిక వర్గానికి చెందిన ఆయన 29వ వార్డు కౌన్సిలర్‌గా అధిక మెజార్టీతో గెలుపొందారు. దీంతో వైస్‌చైర్మన్‌గా రవిశంకర్‌గుప్తాకు ఖరారైంది. ఆదివారం రాత్రి 10 గంటల వరకూ ఆయన పేరునే అధిష్ఠానం కూడా సిఫారసు చేసింది. అనంతరం కూటమి ధర్మాన్ని పాటించాలని, వైస్‌చైర్మన్‌ సీటు జనసేన కేటాయిస్తూ.. వాడరేవు అశోక్‌ పేరు(ఒకటో వార్డు కౌన్సిలర్‌)ను అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో అర్ధరాత్రి నుంచి టీటీపీ నాయకుల్లో కలవరం ప్రారంభమైంది. రవిశంకర్‌గుప్తాను కాదని అశోక్‌ పేరును ప్రకటించడంపై మొత్తం టీడీపీ కౌన్సిలర్లు మసస్తాపానికి గురయ్యారు. ఎమ్మెల్యే గౌతు శిరీష, టీడీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకన్నచౌదిరి, ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావులు.. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వారి సలహా మేరకు రాష్ట్ర కమిటీకి కూడా వివరాలు అందించారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో టీడీపీ కౌన్సిలర్లు, పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ నాయకులు నైరాశ్యానికి గురయ్యారు. దీంతో సోమవారం కౌన్సిలర్‌ సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన కొద్దిసేపటి తర్వాత ఇళ్లకు వెళ్లిపోయారు. వైస్‌చైర్మన్‌ ఎన్నికకు సంబంధించి కోరం లేక మంగళవారానికి వాయిదా వేసినట్టు ఎన్నికల అధికారి శ్రీనివాసరావు ప్రకటించారు. జరిగిన పరిణామాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా జనసేన పార్టీకి సంబంధించి మొత్తం ముగ్గురు కౌన్సిలర్లు ఉండగా.. వారు కూడా టీడీపీ నాయకుల వెంటే వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • బి.ఫారం సమర్పించిన జనసేన

  • వైస్‌చైర్మన్‌ పదవి కోసం జనసేన-టీడీపీ మధ్య దోబూచులాట జరుగుతుండగా జనసేనకు చెందిన వాడరేవు అశోక్‌కుమార్‌ బి.పారాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ ఇ.శ్రీనివాసులకు జనసేన నాయకులు అందించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా సభ ప్రారంభ సమయానికి వైసీపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ శ్రీకాంత్‌.. వారి సీట్లులో కూర్చున్నారు. కూటమి సభ్యులు ఎవరూ సభలోకి ప్రవేశించకుండా జాగ్రత్తపడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీ కౌన్సిలర్లు అంతా ప్రమాణ స్వీకారం చేసి బయటకు వెళ్లిపోవడంతో సభ వాయిదా పడింది.

Updated Date - Nov 24 , 2026 | 12:19 AM