Share News

పోర్టుతో జిల్లా రూపురేఖలు మారుతాయ్‌

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:17 AM

Visakhapatnam-Gunupur passenger train halted మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పోర్టు నిర్మాణం పూర్తయితే టెక్కలి నియోజకవర్గమే కాకుండా జిల్లా రూపురేఖలు మారుతాయ’ని కేంద్ర పౌరవిమానాయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

పోర్టుతో జిల్లా రూపురేఖలు మారుతాయ్‌
విశాఖ-గుణుపూర్‌ రైలును జెండా ఊపి ప్రారంభిస్తున్న కేంద్రరాష్ట్ర మంత్రులు

కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

హరిశ్చంద్రపురంలో విశాఖ-గుణుపూర్‌ పాసింజర్‌ రైలుకు హాల్ట్‌

కోటబొమ్మాళి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ‘మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పోర్టు నిర్మాణం పూర్తయితే టెక్కలి నియోజకవర్గమే కాకుండా జిల్లా రూపురేఖలు మారుతాయ’ని కేంద్ర పౌరవిమానాయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. శుక్రవారం హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రైల్వే డీఆర్‌ఎం లలిత్‌ బోహ్రోతో కలిసి విశాఖ- గుణుపూర్‌ పాసింజర్‌ రైలు హాల్ట్‌ను ప్రారంభించారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్‌ను అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గుణుపూర్‌ - విశాఖ రైలు హాల్ట్‌ కల్పించాం. తర్వలో మరిన్ని రైళ్లు ఇక్కడ ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ స్టేషన్‌ పరిధిలో 40 ఎకరాల రైల్వే భూములు ఉన్నాయి. వాటిని త్వరలో సరుకు రవాణా కేంద్రంగా ఉన్నతీకరించాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరగా.. సరే అన్నారు. త్వరలో విశాఖ రైల్వే జోన్‌ ప్రారంభిస్తాం. దీని ద్వారా జిల్లాలో రైల్వే సమస్యలు పరిష్కారమవుతాయ’ని తెలిపారు.

రైల్వేగేటు, రహదారి వెడల్పు చేయండి

టెక్కలి రైల్వేగేటు, రహదారి వెడల్పు చేయాలని కోరుతూ డీఆర్‌ఎం లలిత్‌బోహ్రాకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం గేటు చిన్నదిగా ఉండడం.. భారీ వాహనాల రాకపోకలతో తరచూ తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించారు. టెక్కలి, చిన్నసాన మధ్య ఉన్న ఎస్‌సీ-8 వద్ద రహదారి వెడల్పును 9 మీటర్లకు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ‘గంగరాం నుంచి కోటబొమ్మాళి వరకు వెళ్లే రోడ్డు, నందిగాం మండలం రౌతుపురం రోడ్డు అభివృద్ధి చేయాలి. రైల్వేట్రాక్‌ల పక్క గ్రామాలకు వెళ్లే రహదారులు మేము నిర్మిస్తాం. మీకు అవసరం ఉన్నప్పుడు వాటిని తొలగించుకోవచ్చు. అందుకు మాకు అనుమతి ఇవ్వాల’ని డీఆర్‌ఎంకు మంత్రి అచ్చెన్న కోరారు. కార్యక్రమంలో రైల్వే సీనియర్‌ డివిజన్‌ ఇంజనీర్‌ ఏ.కె.మహారనా, సీనియర్‌ సెక్యూరిటీ కమిషనర్‌ ఏపీ దూబే, రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్‌ బోయిన గోవిందరాజులు, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, హరిశ్చంద్రపురం మాజీ సర్పంచ్‌ పూజారి శైలజ సత్యనారాయణ, టెక్కలి ఆర్డీవో ఎన్‌.కృష్ణమూర్తి, టీడీపీ నేతలు బోయిన రమేష్‌, వెలమల విజయలక్ష్మి, తర్ర రామకృష్ణ, ఉప్పాడ జయరాం పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:17 AM