భక్తుల భద్రతే ముఖ్యం
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:18 AM
Arrangements for the Rathasaptami festival ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో జరగనున్న రథసప్తమి వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.
రథసప్తమి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
క్యూలైన్లు, ట్రాఫిక్ మళ్లింపుపై ప్రత్యేక దృష్టి
హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశం
శ్రీకాకుళం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో జరగనున్న రథసప్తమి వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె శ్రీకాకుళంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి రథసప్తమి ఏర్పాట్లపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ‘రథసప్తమికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. వారి భద్రతే ప్రధాన ధ్యేయంగా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పనిచేయాలి. క్యూలైన్ల నిర్వహణ సక్రమంగా ఉండాలి. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పటిష్టమైన మళ్లింపు (డైవర్షన్) చర్యలు చేపట్టాలి. పార్కింగ్ స్థలాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పోలీసు, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాల’ని ఆదేశించారు. అనంతరం జిల్లాలో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితిపై ఆమె ఆరా తీశారు. అంతకుముందు జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న హోంమంత్రి అనితకు జిల్లా యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. మంత్రి గౌరవ వందనం స్వీకరించారు.