Share News

పోలీసుల త్యాగాలు అజరామరం

ABN , Publish Date - Oct 22 , 2026 | 01:25 AM

ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీసుల సేవలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

పోలీసుల త్యాగాలు అజరామరం
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, వైదికపై ఎస్పీ మహేశ్వరరెడ్డి, పోలీసు అధికారులు

  • ప్రజల రక్షణలో వారి సేవలు మరువలేనివి

  • నిస్వార్థ సేవలకు ఎప్పుడూ గుర్తింపు

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం: ఎప్పీ మహేశ్వరరెడ్డి

  • ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం

శ్రీకాకుళం కైరం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీసుల సేవలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సంస్మరణ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పరేడ్‌ కమాండర్‌ శంకర్‌ ప్రసాద్‌ నేతృత్వంలో నిర్వహించిన పరేడ్‌తో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలు, తుపాన్లు, ఇతర విపత్తులు, బందోబస్తు విధుల్లో కానిస్టేబుల్‌ నుంచి ఉన్నతాధికారుల వరకు పోలీసులు కీలక సేవలందిస్తున్నారని ప్రశంసించారు. ప్రజలతో వ్యవహరించేటప్పుడు సంయమనం, మంచి ప్రవర్తన ప్రదర్శించాలని సూచించారు. గంజాయి నియంత్రణ, మహిళల భద్రతలో జిల్లా పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు. డిజిటల్‌, సైబర్‌ నేరాల నియంత్రణలోనూ ప్రత్యేక నైపుణ్యాలు సాధించాలని సూచించారు. పోలీసు శాఖలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ యూనిఫాం బలగాల్లో అమరులైన 154 మందిని, రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన హెడ్‌ కానిస్టేబుల్‌ను, శ్రీకాకుళం జిల్లాలో గతంలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ఐదుగురు పోలీసులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పోలీసు సంక్షేమ పథకాల వివరాలను ఎస్పీ వెల్లడించారు. భద్రతా పథకం కింద తీశ మందికి వ్యక్తిగత రుణాలు, ఒకరికి గృహ రుణం, వెల్ఫేర్‌ పథకం ద్వారా 17 మందికి రుణాలు మంజూరు చేసినట్టు తెలిపారు. జిల్లా కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీలో 417 మంది సభ్యులకు రూ.8.59 కోట్ల రుణాలు అందించినట్టు చెప్పారు. పోలీసు శాలరీ ప్యాకేజీ కింద మరణ పరిహారాలు పెరిగాయని, ఇటీవల ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్‌ గోపాలకృష్ణ కుటుంబానికి రూ.కోటి పరిహారంతో పాటు మరో రూ.థ.థి లక్షల బీమా పరిహారం అందించినట్టు వివరించారు. సిబ్బంది పిల్లల్లో శీథ మందికి రూ.20.3 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ చేశామన్నారు. సిబ్బందికి ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, జెమ్స్‌, కిమ్స్‌, మెడికవర్‌ ఆసుపత్రులతో చర్చించి రాయితీ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్‌, ఎస్పీ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. సంస్మరణ గ్రంథాన్ని ఆవిష్కరించారు. అమరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని జ్ఞాపికలు అందజేశారు. పోలీసు ఆయుధ సంపత్తితో ఏర్పాటు చేసిన ఓపెన్‌హౌస్‌ ప్రదర్శనను ప్రారంభించారు. అక్కడి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు నిర్వహించిన ర్యాలీ, మానవహారంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, విజిలెన్స్‌ ఏఎస్పీ వివేకానంద, డీఎస్పీలు ధనుంజయనాయుడు, లక్ష్మణరావు, పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 01:25 AM