Share News

రెవెన్యూ వ్యవస్థే కీలకం

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:14 AM

A solution a month for long-standing problems కాగితంపై వివరాలకు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను బేరీజు వేస్తూ.. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో రెవెన్యూ వ్యవస్థ అత్యంత సమర్థంగా పనిచేస్తోందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కొనియాడారు.

రెవెన్యూ వ్యవస్థే కీలకం
మాట్లాడుతున్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

దీర్ఘకాలిక సమస్యలకు నెలకో పరిష్కారం

కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

శ్రీకాకుళం, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): కాగితంపై వివరాలకు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను బేరీజు వేస్తూ.. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో రెవెన్యూ వ్యవస్థ అత్యంత సమర్థంగా పనిచేస్తోందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కొనియాడారు. శనివారం శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో నిర్వహించిన ‘రెవెన్యూ డే’ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెవెన్యూ శాఖలో విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన సీనియర్‌ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ శాఖ ప్రతిష్ఠను, గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఉద్యోగ వర్గానికి రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో విజయవంతం కావాలన్నా రెవెన్యూ వ్యవస్థే అత్యంత కీలకమ’ని తెలిపారు. జిల్లాలోని దీర్ఘకాలిక సమస్యలను ముందుగా గుర్తించి, నెలకు ఒక సమస్యపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాలని కలెక్టర్‌ను కోరారు. ప్రజాప్రతినిధుల సమన్వయంతో వాటికి శాశ్వత పరిష్కార మార్గాలు చూపేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ ఉద్యోగులపై మానసిక ఒత్తిడి తగ్గించేలా ప్రత్యేక కార్యక్రమాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని తెలిపారు.

ఎయిర్‌పోర్టుపై అపోహలు వద్దు

జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పలాస ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపై స్థానిక ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందని మంత్రి రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయంగా జరిగే పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆర్డీవో సాయిప్రత్యూష, జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ ప్రతినిధులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:14 AM