తేలిన ప్రాదేశికం లెక్క!
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:05 AM
ఇచ్ఛాపురంలో ప్రాదేశిక ఎన్నికల సమరం మొదలైంది. పోటీచేసే అభ్యర్థులు తేలడంతో వారంతా ప్రచారంలో మునిగారు.
- ఇచ్ఛాపురం జడ్పీటీసీ జనసేనకు..
- కంచిలిలో మూడుచోట్ల కూటమిలో ఫ్రెండ్లీ పోటీ
- మిగతా మూడు మండలాల్లో సమన్వయం
- ప్రచారంలో అభ్యర్థుల తలమునకలు
ఇచ్ఛాపురం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురంలో ప్రాదేశిక ఎన్నికల సమరం మొదలైంది. పోటీచేసే అభ్యర్థులు తేలడంతో వారంతా ప్రచారంలో మునిగారు. దీంతో గ్రామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా.. కంచిలి మండలంలోని బైరిపురం ప్రాదేశికం ఏకగ్రీవమైంది. ఇక్కడ టీడీపీకి చెందిన బుడ్డేపు ప్రకాశరావు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమైంది. దాదాపు అన్నిచోట్ల పోటీ ఉంది. నాలుగు జడ్పీటీసీలకుగాను ఇచ్ఛాపురం నుంచి జనసేనకు అవకాశం కల్పించారు. కవిటి, కంచిలి, సోంపేటల నుంచి టీడీపీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట మండలాల్లో కూటమి మధ్య సమన్వయం కుదిరింది. కానీ కంచిలి మండలంలో మాత్రం రెండు, మూడుచోట్ల టీడీపీ, జనసేన పరస్పరం పోటీకి దిగడం విశేషం.
- ఇచ్ఛాపురం మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ నుంచి 15 మంది, వైసీపీ నుంచి 15 మంది, కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లగా నలుగురు బరిలో ఉన్నారు.
- సోంపేట మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలకుగాను 18 చోట్ల టీడీపీ, వైసీపీ 23 చోట్ల, జనసేన 5 చోట్ల, బీజేపీ ఒక చోట బరిలో ఉంది. నలుగురు ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు.
- కవిటి మండలంలో 22 స్థానాలకుగాను టీడీపీ 17, వైసీపీ 22, జనసేన 4, బీజేపీ ఒకచోట పోటీలో ఉంది. ఏడుగురు ఇండిపెండెంట్లు ఇక్కడ బరిలో ఉన్నారు.
-కంచిలి మండలంలో మాత్రం కూటమిలో సంక్లిష్టత ఏర్పడింది. మొత్తం 19 స్థానాలకుగాను ఒకటి ఏకగ్రీవమైంది. మిగిలిన 18చోట్ల టీడీపీ, వైసీపీ 18 చోట్ల, జనసేన 4చోట్ల, సీపీఎం ఒక చోట బరిలో ఉంది. మూడుచోట్ల కూటమి అభ్యర్థులు వేర్వేరుగా బరిలో దిగారు. వైసీపీ నుంచి ఒకరు రెబల్‌గా మారి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్నారు. కొక్కిలిపుట్టుగా ఎంపీటీసీ స్థానానికి మాదిన రామారావు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. అక్కడ జనసేన తరపున కీలు రంజన్ పోటీచేస్తున్నారు. ఎంఎస్‌పల్లి ప్రాదేశికంలో టీడీపీ నుంచి బుడ్డేపు లక్మి పోటీచేస్తుండగా, జనసేన తరపున పైల జ్యోతి బరిలో ఉన్నారు. గోకర్ణపుం ప్రాదేశికం నుంచి టీడీపీ అభ్యర్థిగా బేసి జియాబాయి, జనసేన నుంచి తరిపిల శారద రంగంలో ఉన్నారు.