వాన దంచింది... జలకళ తెచ్చింది!
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:24 AM
The Nagavali's Furious Form తుఫాన్ ప్రభావంతో మూడురోజులపాటు కురిసిన భారీ వర్షాలతో జిల్లాకు జలకళ వచ్చింది. వంశధార, నాగావళి, బాహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్టాబ్యారేజీ, నారాయణపురం ఆనకట్టల వద్ద వరదనీటి ప్రవాహం పెరిగింది.
ఉధృతంగా ప్రవహిస్తున్న వంశధార, నాగావళి, బాహుదా నదులు
ఉమ్మడి జిల్లాలో 107 గ్రామాల్లో వరద ఉధృతి
‘అల్లెన’ గ్రామాన్ని చుట్టేసిన ‘నాగావళి’
శ్రీకాకుళం/ నరసన్నపేట/ ఇచ్ఛాపురం/ హిరమండలం/ బూర్జ, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావంతో మూడురోజులపాటు కురిసిన భారీ వర్షాలతో జిల్లాకు జలకళ వచ్చింది. వంశధార, నాగావళి, బాహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్టాబ్యారేజీ, నారాయణపురం ఆనకట్టల వద్ద వరదనీటి ప్రవాహం పెరిగింది. మరోవైపు చెరువులు, వాగులు నీటితో కళకళలాడుతున్నాయి. ఇన్నాళ్లూ ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి కోసం ఇబ్బందులు పడుతూ.. వర్షాల కోసం ఎదురుచూసిన రైతుల్లో.. ప్రస్తుతం సంతోషం కనిపిస్తోంది. ఇక సాగునీటి ఇబ్బందులు తీరినట్టేనని.. వారంతా సంబరపడుతున్నారు.
నాగావళి ఉగ్రరూపం
జిల్లాలో ‘నాగావళి’ నది ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం వేకువజాము నుంచి ఉధృతంగా ప్రవహించింది. వరద తీవ్రత దృష్ట్యా తోటపల్లి ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తివేశారు. ఇటు నారాయణపురం ఆనకట్ట, మడ్డువలస గేట్లను సైతం ఎత్తివేయడంతో.. మొత్తం వరద నీరు అంతా ‘నాగావళి’ నదిలో చేరింది. ఉదయం 7.15 గంటలకు నారాయణపురం ఆనకట్ట నుంచి 60వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మధ్యాహ్నం నారాయణపురం ఆనకట్ట నుంచి 80వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టి రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో 107 గ్రామాల్లో వరదనీరు ఉధృతంగా ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. నదికి ఆనుకున్న కట్టడాల్లోకి, దేవాలయాల్లోకి నీరు చేరింది. శ్రీకాకుళం, టెక్కలి రెవెన్యూ డివిజన్‌లలో పంటపొలాలు అధికంగా ముంపునకు గురయ్యాయి.
అల్లెన గ్రామాన్ని చుట్టుముట్టిన వరదనీరు..
ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం అల్లెన గ్రామాన్ని నాగావళి వరద నీరు చుట్టుముట్టింది. శుక్రవారం బూర్జ మండలం అల్లెన, లక్కుపురం గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పర్యటించారు. వరదనీటి పరిస్థితిని పరిశీలించారు. లక్కుపురంలో రహదారిపైకి మోకాలిలోతులో నీరు చేరడంతో.. వారంతా అవస్థలు పడ్డారు. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అధికారులు కొట్టుకుపోయే పరిస్థితి ఎదురైంది. ముందుజాగ్రత్తగా లైఫ్ జాకెట్లు ధరించి పోలీసు జీపులో ప్రయాణించి తీవ్రతను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఎక్కడా ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.
బాహుదానదికి భారీగా వరదనీరు
బాహుదా నదిలో భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. జిల్లాలో కురిసిన వర్షాలతోపాటు.. ఒడిశాలో బగలెట్టి డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నదిలో నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు 28,656 క్యూసెక్కులకు చేరింది. నదిలో శివుడి విగ్రహం సగానికిపైగా మునిగిపోయింది. ఊటబావులు పూర్తిగా మునిగిపోయాయి. క్రమేపీ వరదనీటి ఉధృతి తగ్గుతుందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేవని తహసీల్దార్ ఎన్.వెంకటరావు తెలిపారు.
ప్రమాదస్థాయిలో వంశధార ప్రవాహం
వంశధార నదిలో వరదనీరు పొంగి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. గురువారం రాత్రి 11 గంటలకు 40వేల క్యూసెక్కులు దాటి వరదనీరు రావడంతో గొట్టాబ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు 47,400 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రాగా, గొట్టాబ్యారేజీ వద్ద 19 గేట్లు పైకెత్తి వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. గొట్టాబ్యారేజీ వద్ద వరద ఉధృతిని ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ సీహెచ్ శేషుబాబు శుక్రవారం పరిశీలించారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టేవరకూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎస్‌ఈ రామచంద్రరావు, ఈఈ మురళీకృష్ణ, డీఈఈ సరస్వతి, ఏఈ ఆనంద్ పాల్గొన్నారు.