‘ప్లాన్’ తప్పుతోంది..
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:09 AM
శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎక్కడ చూసినా అక్రమ భవన నిర్మాణాలే కనిపిస్తున్నాయి.
- శ్రీకాకుళం నగరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు
- అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న కొందరు అధికారులు
- రూ.2లక్షలు వరకు ముడుపులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు
శ్రీకాకుళం అర్బన్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎక్కడ చూసినా అక్రమ భవన నిర్మాణాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఒకలా అనుమతి పొంది నిర్మాణాలు మరోలా చేస్తున్నారు. కొంతమంది అధికారులకు ముడుపులు ఇస్తే చాలు అక్రమాలకు అనుగుణంగా ప్లాన్ మారిపోతుందన్న విమర్శలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో నగరపాలక ఉన్నతాధికారితో పాటు కీలక అధికారులు సుమారు రెండు నెలలు ఎలక్షన్ విధుల్లో బిజీగా గడిపారు. ఇదే అదునుగా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ప్లానింగ్ సెక్రటరీ, చైన్మెన్లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదనపు ప్లోర్‌కు, అనుమతి లేని నిర్మాణాలకు రూ.2 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముడుపులు ఇస్తే సరి లేదంటే ఏదో ఒక రకంగా కొర్రీపెట్టి నిర్మాణాలు ఆపేస్తారనే విమర్శలు ఉన్నాయి.
పాలకవర్గం లేకపోవడంతో..
శ్రీకాకుళం నగరపాలక సంస్థకు పాలకవర్గం లేకపోవడం అక్రమార్కులకు కలిసి వస్తుందనే వాదన ఉంది. నిబంధనల ప్రకారం 200 చదరపు గజాల స్థలంలో నిర్మించే భవనానికి విధిగా సెట్ బ్యాక్ వదలాలి. ఇంటి ముందు, వెనుక భాగాల్లో రెండు మీటర్లు, మిగతా రెండువైపులా 1.5 మీటర్లు స్థలాన్ని వదలాలి. సెల్లారులోనే పార్కింగ్ స్థలం ఉండాలి. అయితే ఈ నిబంధనలను 90 శాతం పాటించడం లేదు. సాధారణంగా నిర్మాణాలు జరుపుకొన్న తర్వాత ప్రభుత్వాలు క్రమబద్ధీక రణకు అవకాశం కల్పిస్తుంటాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రూ.700 కోట్ల ఆదాయం వచ్చేలా చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అవకాశం ఇస్తుందనే నమ్మకంతో చాలామంది అక్రమ నిర్మాణాలకు పూనుకుంటున్నారు. అయితే, ఏడాది కిందట నిర్మించిన వాటినే పునఃపరిశీలించి తర్వాత క్రమబద్ధీకరిస్తారన్న విషయాన్ని వీరు మరచిపోతున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే కేసులు
టౌన్‌ప్లానింగ్ విషయంలో ప్రభుత్వం ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చింది. తప్పు జరిగితే భవన యజమానితో పాటు ప్లానర్‌పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. గతంలో 300 స్క్వేర్ మీటర్లో భవన నిర్మాణం చేసుకుంటే కొంత సడలింపు ఉండేది. మార్టు గేజ్ ఉండడంతో చిన్న చిన్న తేడాలు ఉన్నా పెద్దగా పట్టంచుకొనేవారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొత్త జీవో ప్రకారం నిబంధనలు అతి క్రమించారని గుర్తిస్తే కేసుల్లో ఇరుక్కోవాల్సిందే. ప్లానర్‌కు ఐదేళ్ల వరకు లైసెన్స్ రద్దు అవుతుంది. స్థల యజమానిపై కేసు నమోదు చేస్తారు. సడలింపు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం కష్టమంటున్నారు. గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ప్లాన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఎల్టీపీలదే కావడంతో భయపడాల్సి వస్తుంది. జీప్లస్-5కు గతంలో టౌన్‌ప్లానింగ్ ఆర్డీ పరిశీలించి ఆమోదం తెలిపినా ఏమైనా అభ్యంతరాలు ఉంటే మార్పులు చేసి ప్లాన్ ఇచ్చేవారు. ఇప్పుడది ఉండదు. అంతా ఎల్టీపీలదే బాధ్యత. స్థలానికి సంబంధించి ఎవరైనా కేసులు ఉన్నట్టు ఫిర్యాదు చేస్తే సంబంధిత యజమానితో పాటు ప్లానర్‌పై కేసులు నమోదు చేస్తారు.
దృష్టిసారించాం
శ్రీకాకుళంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై ప్రత్యేక దృష్టిసారించాం. టౌన్ ప్లానింగ్ అధికారులను సైతం అప్రమత్తం చేశాం. ఎటువంటి అక్రమాలు జరగకుండా చూస్తాం. అవసరమైతే కేసులు నమోదు చేస్తాం. అపరాధ రుసుం వసూలు చేస్తాం. ఈ విషయంలో అవసరమైతే రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుంటాం.
-జానకి, అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ కమిషనర్