ఆక్రమణల పేట
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:16 AM
నరసన్నపేట పట్టణంలో వంశధార కాలువలు ఆక్రమణకు గురవుతున్నాయి.
- వంశధార కాలువల కబ్జా
-గట్లను ఆక్రమించి భవన నిర్మాణాలు
- తప్పుడు పత్రాలతో బురిడీ
- ఫిర్యాదులు చేస్తున్నా చలించని అధికారులు
నరసన్నపేట, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణంలో వంశధార కాలువలు ఆక్రమణకు గురవుతున్నాయి. పట్టణానికి ఆనుకొని ఉన్న భూములు కోట్ల రూపాయల ధర పలుకుతుండడంతో ఆక్రమణదారుల కన్ను సాగునీటి కాలువలపై పడింది. కాలువ గట్లను ఆక్రమించి భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రధానంగా జమ్ముజంక్షన్, హడ్కోకాలనీ, వంశధార నగర్, దేశవానిపేట, రావులవలస తదితర గ్రామాల వద్ద ఉన్న 11 ఆర్ కిళ్లాం, ఎన్బీసీ కాలువలు కబ్జాకు గురవుతున్నాయి. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేసినా వంశధార అధికారులు చలించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఆక్రమణలు ఇలా..
- నరసన్నపేట నడిబొడ్డున ఉన్న వంశధార నగర్ వద్ద ఒక వైసీపీ యువ నాయకుడు సాగునీటి కాలువ స్థలాన్ని అక్రమించి భారీ భవన నిర్మాణం చేపడుతున్నాడు. ఈ నాయకుడికి ఈ కాలువ పక్కనే స్థలం ఉంది. ఆ డాక్యుమెంట్లు చూపించి కాలువ స్థలం భారీ భవన నిర్మాణం చేపడుతున్నాడు. వంశధార కార్యాలయానికి కూతవేటు దూరంలో గత వారం రోజులుగా ఈ పనులు జరుగుతున్నా వంశధార అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే నాయకుడు గతంలో కూడా ఇదే కాలువ గట్టుమీద ముందుభాగంలో డాబా నిర్మించాడు.
- జమ్ముజంక్షన్ వద్ద ఎన్బీసీ కాలువ గట్టును కొందరు ఆక్రమించి పిల్లర్లు ఏర్పాటు చేశారు. దీనిపై పత్రికల్లో కథనాలు వచ్చి నెలరోజులైనా వంశధార అధికారులు చలించలేదు. ఎన్బీసీ కాలువ గట్టుపై భవనాలను కూడా నిర్మిస్తున్నారు.
- బొరిగివలస- కళాసీ కాలనీ సమీపంలో కాలువను ఆక్రమించి జోరుగా నిర్మాణాలు చేపడుతున్నారు.
- జమ్ము జంక్షన్ వద్ద ఎన్బీసీ కాలువను ఒక రియల్‌ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించి ప్లాట్లు వేసి విక్రయాలు చేపట్టాడు.
- గొట్టిపల్లికి వెళ్లే మార్గంలో కాలువ ఆక్రమణకు గురైంది. ఇక్కడ భవన నిర్మాణాలు చేపట్టడంతో నీరు వెళ్లే మార్గం లేక ఏటా పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. దీనిపై రైతు నేతింటి విశ్వేశ్వరరావు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు
- మారుతీనగర్‌లో ఉన్న కాలువ రూపు కోల్పోయింది. కాలువ ఆనవాళ్లు లేకుండా నిర్మాణాలు జరిగాయి.
- వంశధార కాలువలు తవ్వే సమయంలో కాలువ మధ్య భాగం నుంచి 40 అడుగుల వరకూ ఇరువైపులా ఇరిగేషన్‌శాఖకే చెందుతుంది. ఈ మేరకు రైతుల నుంచి మొత్తం 80 అడుగులు సేకరించి తవ్వకాలు చేపట్టారు. కానీ కాలువకు ఆనించి ఉన్న కొందరు భూ యజమానులు కాలువ గట్లను ఆక్రమిస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
సాగునీటి కాలువ గట్లను ఆక్రమిస్తే శాఖా పరంగా తగు చర్యలు తీసుకుంటాం. నరసన్నపేటలో ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణాలను పరిశీలిస్తాం. ఆక్రమణదారులపై చర్యలు తప్పవు.
-మురళీమోహన్, ఈఈ, వంశధార