మద్యం మత్తు తెచ్చిన ముప్పు
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:43 PM
మద్యం తాగే క్రమంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి మృతికి దారి తీసింది. ఇద్దరు యువకులు ఒకరిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మద్యం తాగే క్రమంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి మృతికి దారి తీసింది. ఇద్దరు యువకులు ఒకరిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి గ్రామం వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గార మండలం శిమ్మపేటకు చెందిన శిమ్మ మోహన్‌రావు (42) భవన నిర్మాణ రంగంలో సీటు సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సోమవారం తన బంధువు శిమ్మ శీనుతో కలిసి ఒప్పంగి గ్రామ సమీపంలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద మద్యం తాగారు. అదే సమయంలో అక్కడ మద్యం తాగుతున్న నీలాపు నీలమప్పడు, అతనికి వరుసకు బావమరిది అయిన పవన్‌తో మోహన్‌రావుకు వాగ్వాదం చోటుచేసుకుంది. మోహన్‌రావు వెంట ఉన్న శీను జోక్యం చేసుకొని ఇద్దరినీ సముదాయించాడు. అనంతరం మోహన్‌రావు, శీనులు అక్కడి నుంచి తమ గ్రామానికి బయలుదేరారు.
వెంబడించి దాడి...
నీలమప్పడు, పవన్‌లు వారిని వెంబడించి... ఒప్పంగి వద్ద ఉన్న రైసు మిల్లు సమీపంలో మోహన్‌రావు, శీనుల బైక్‌లను అడ్డగించారు. నీలమప్పడు చేతికి ఉన్న ఇనుప కడియంతో మోహన్‌రావు తలపై బలంగా దాడి చేశాడు. పవన్ కూడా మోహన్‌రావుపై పిడిగుద్దులు కురిపించాడు. తీవ్రంగా గాయపడిన మోహన్‌రావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. శీను వెంటనే 108లో మోహన్‌రావును చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి...కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. తలకు బలమైన గాయం కావడంతో అప్పటికే మోహన్‌రావు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
సీసీ కెమెరాలు.. సెల్‌ఫోన్ సిగ్నల్స్‌తో గుర్తింపు
మృతుడి భార్య లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ కరణం వెంకట సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన రైస్‌మిల్లు పరిసరాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలతో పాటు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నీలమప్పడు, పవన్‌లను రాయగడ వద్ద అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.