జడలు విప్పుతున్న మహమ్మారి
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:52 PM
జిల్లాలో ఎయిడ్స్ మహమ్మారి జడలు విప్పుతోంది. ప్రతి ఏటా హెచ్‌ఐవీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
- జిల్లాలో పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులు
- మొత్తం 8,493 మంది బాధితులు
- ఈ ఏడాది 208 కొత్తవి నమోదు
- ఆ ఐదు మండలాల్లో అధికం
- కానరాని అవగాహన కార్యక్రమాలు
శ్రీకాకుళం కల్చరల్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎయిడ్స్ మహమ్మారి జడలు విప్పుతోంది. ప్రతి ఏటా హెచ్‌ఐవీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 8,493 మంది హెచ్‌ఐవీ రోగులు ఉన్నారు. గత ఏడాది 337 కొత్తకేసులు బయటపడగా, ఈ ఏడాదిలో ఆగస్టు వరకూ 208 కొత్త కేసులు వెలుగు చూశాయి. జిల్లాలో ఎయిడ్స్ వ్యాపిస్తున్న హైరిస్క్ గ్రామాలు 108 వరకు ఉన్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురంతో పాటు మరికొన్ని మండలాల్లో వ్యాధివ్యాప్తి ఎక్కువగా ఉంది. గత సంవత్సరం శ్రీకాకుళం మండలంలో అత్యధికంగా 83, టెక్కలిలో 40, నరసన్నపేటలో 25, పలాస, ఇచ్ఛాపురం మండలాల్లో చెరో 14 కేసులు చొప్పున నమోదయ్యాయి. ఈ సంవత్సరం నమోదైన 208 కొత్త కేసులు కూడా ఈ మండలాల్లోనే ఎక్కువుగా ఉన్నాయి. గత ఏడాది 13 మంది గర్భిణులు ఈ మహమ్మారి బారిన పడితే, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ముగ్గురు గర్భిణులకు హెచ్‌ఐవీ సోకింది. 29 మంది ట్రాన్స్‌జెండర్లు కూడా హెచ్‌ఐవీకి గురయ్యారు.
- శ్రీకాకుళం ఏఆర్‌టీ కేంద్రంలో 6,580 మంది ఎయిడ్స్ రోగులు, టెక్కలి ఏఆర్‌టీలో 1826 మంది, రాగోలు జెమ్స్ ఏఆర్‌టీలో 87 మంది చికిత్స పొందుతున్నారు. శ్రీకాకుళం సర్వజనాసుపత్రి ఎఆర్‌ఈ సెంటర్ పరిదిలో గత ఏడాది 230 కొత్త ఎయిడ్స్ కేసులు నమోదైతే, ఈ ఏడాడి ఆగస్టు వరకు 167 కొత్త కేసులు నమోదయ్యాయి.
పరీక్షలు చేయించుకోవట్లే..
సమాజంలో ఎయిడ్స్ పట్ల ఉన్న భయాందోళన కారణంగా స్వచ్ఛందంగా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకొనే వారు చాలా తక్కువ. జిల్లాలో ఉన్న 15 ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్ల (ఐసీటీసీ)తో పాటు మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్ ద్వారా జిల్లాలోని హైరిస్క్ గ్రామాలకు సిబ్బంది వెళ్లి అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు.ఈ శిబిరాలకు వచ్చే అనుమానితులను పరీక్షిస్తున్నప్పుడు మాత్రమే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. జిల్లాలో నమోదవుతున్న హెచ్‌ఐవీ కేసులన్నీ సురక్షితం కాని లైంగిక చర్యలవల్లే వస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా లైంగిక చర్యల్లో పాల్గొని అనుమానం ఉన్నప్పుడు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. ఒకసారి పరీక్ష చేయించుకున్న తరువాత నెగిటివ్ వస్తే హెచ్‌ఐవీ లేదని సంబరపడిపోకూడదని, ఆరు నెలల వ్యవధిలో మరోసారి మళ్లీ పరీక్ష చేయించుకుంటే తప్ప హెచ్‌ఐవీ వైరస్ ఉన్నదీలేనిదీ నిర్దారణ కాదని శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలోని ఏఆర్‌టీసెంటర్ వైద్యాధికారి డా.కె.చక్రవర్తి స్పష్టం చేస్తున్నారు.
థెరపీ ద్వారా చికిత్స
బరువు తగ్గడం, నెలల తరబడి జ్వరం, విరేచనాలు ఉండడం, తరచూ ఇన్పెక్షన్లు సోకడం, సన్నగా అయిపోవడం వంటి లక్షణాలు ఉంటేనే అనుమానంతో వచ్చి పరీక్ష చేయించుకుంటున్నారు. క్షయవ్యాధి సోకితే హెచ్‌ఐవీ వైరస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల టీబీ పేషెంట్లు అందరికీ తప్పనిసరిగా హెచ్‌ఐవీ టెస్ట్ చేస్తారు. హెచ్‌ఐవీ ఉన్నట్లు అయితే ఏఆర్‌టీ సెంటర్లకు వస్తున్నారు. ఇలా వచ్చిన వారికి యాంటీరెట్రోవైరల్ థెరపీ ద్వారా చికిత్స అందిస్తారు. శరీరంలో వైరస్ లోడ్‌ను బాగా తగ్గించగలిగే మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. కొందరు రోగులు అస్తవ్యస్తంగా మందులు వాడడం, కొద్దికాలం వాడి నిర్లక్ష్యం చేయడం వల్ల వైరస్ విజృంభించడానికి అవకాశం ఉంది. థెరపీని క్రమం తప్పకుండా కొనసాగిస్తే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది.
అవగాహన కార్యక్రమాలు ఎక్కడ?
నిశ్శబ్దం వీడాలి. హెచ్‌ఐవీ గురించి అందరూ మాట్లాడాలి..చర్చించాలి అన్నది కేవలం మాటలకే పరిమితం అవుతోంది. ఎయిడ్స్‌పై యువతలో అవగాహన కార్యక్రమాల అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. దీనిపై డీఎల్‌ఏటీవో టి.శ్రీకాంత్‌ను వివరణ కోరగా.. ‘ఏడాదికొకసారి 5కే రెడ్‌రన్ పేరుతో పరుగు, ఏడాదికి 15 రోజులపాటు హైరిస్క్ ప్రాంతాల్లో ఐఈసీ వ్యాన్ ద్వారా ఎయిడ్స్‌పై వీడియో ప్రదర్శనలు చేపడుతున్నాం. మొబైల్ ఐసీటీసీ సెంటర్ల ద్వారా, ఐసీటీసీ కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నాం.’ అని తెలిపారు.