వాహనదారులు తగ్గట్లే!
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:02 AM
జిల్లాలో రహదారి భద్రతకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా వాహనదారుల్లో మాత్రం ఆశించిన మార్పురావడం లేదు.
- ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు
- పోలీసులు చర్యలు చేపడుతున్నా మారని తీరు
- ఒక్క ఏడాదిలోనే 43వేల మందిపై కేసులు
- రూ.6.34 కోట్ల జరిమానా వసూలు
శ్రీకాకుళం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రహదారి భద్రతకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా వాహనదారుల్లో మాత్రం ఆశించిన మార్పురావడం లేదు. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వాహనాల నడపడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. డంకెన్ డ్రైవ్ కేసులు కూడా తగ్గడం లేదు. గతేడాది ట్రాఫిక్ చలానాల వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడి గతేడాది డిసెంబరు నెలాఖరులో విడుదల చేసిన వార్షిక నేర నివేదికలోని గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
రూ.6.84 కోట్ల వసూలు..
ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై ఈ-చలానాల అస్త్రం బలంగా పనిచేసింది. 2024లో జిల్లా వ్యాప్తంగా 79,110 ఈ-చలానాల ద్వారా రూ.3.18 కోట్లు వసూలు కాగా 2025 నాటికి ఈ మొత్తం రెట్టింపు అయ్యింది. 2025లో 87,700 ఈ-చలానాల ద్వారా ఏకంగా రూ.6,84,39,440 జరిమానా వసూలు చేశారు. వాహనదారుల్లో పెరుగుతున్న నిర్లక్ష్యానికి.. పోలీసుల నిఘా పటిష్టతకు ఈ గణాంకాలే నిదర్శనం.
హెల్మెట్, సీటు బెల్టు ధరించిన వారిపై చర్యలు..
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టానికి ప్రధాన కారణం హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడమే. గతేడాది హెల్మెట్, సీటు బెల్టు ధరించని 43,413 మంది వాహనచోదకులపై పోలీసులు కేసు నమోదు చేసి జరిమానా విధించారు. హెల్మెట్ లేని ప్రయాణం వల్ల చిన్న ప్రమాదాలు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయని పోలీసులు అంటున్నారు.
డ్రంకెన్ డ్రైవ్..
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 2025 ఏడాది పొడవునా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 6,338 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 38 మందికి జైలు శిక్ష పడగా.. 286 మందికి రూ.10వేలు చొప్పున జరిమానా విధించారు. అంతేకాకుండా 223 మంది డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దుకు ఆర్టీవోకు సిఫారసు చేయగా.. ఇప్పటివరకు 62 మంది లైసెన్స్‌లు సస్పెండ్ అయ్యాయి.
తగ్గిన ప్రమాదాలు
పోలీసుల కఠిన చర్యలు, అవగాహన కార్యక్రమాల ఫలితంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2024లో 887 ప్రమాదాలు జరగగా, 2025లో ఆ సంఖ్య 702కు తగ్గింది. మరణాల సంఖ్య కూడా 288 నుంచి 266కు తగ్గింది. జాతీయ రహదారిపై స్టాప్ వాష్ అండ్ గో వంటి వినూత్న కార్యక్రమం అమలు చేయడం, ప్రతి 20 కిలోమీటర్లకు ఒక పెట్రోలింగ్ వాహనం ఏర్పాటు చేయడం సత్ఫలితాలనిచ్చింది.
బాధితులకు పరిహారం
హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం అందించడంలో జిల్లా పోలీసులు చొరవ చూపారు. ఈ ఏడాది 86 ప్రతిపాదనలను కలెక్టర్ కార్యాలయానికి పంపగా.. ఇప్పటివరకు 29 కేసుల్లో బాధితులకు రూ.34 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు.
జాగ్రత్తలు పాటించాలి..
ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వరాదు. పోలీసులు ఫైన్ వేస్తారని కాకుండా మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించండి. తలకు గాయమైతే ప్రాణానికే ముప్పు అని గ్రహించండి. హైవేలపై రద్దీ ప్రాంతాల్లో షార్ట్‌కట్ కోసం రాంగ్ రూట్‌లో వెళ్లడం ప్రమాదం. జాతీయ రహదరిపై ప్రయాణించేటప్పుడు నిద్రమత్తుగా అనిపిస్తే వెంటనే వాహనం ఆపి ముఖం కడుక్కోవాలి. పోలీసులు నిర్వహిస్తున్న స్టాప్ వాష్.. గో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి.