దేశానికే ఆదర్శం ఎన్టీఆర్ భరోసా పింఛన్
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:34 AM
రాష్ట్రంలో అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధకశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
నందిగాం, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధకశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం మండలంలోని రాంపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 65లక్షల మందికి రూ.4వేలు, రూ.6వేలు, రూ.10వేలు, రూ.15వేల చొప్పున వివిధ రకాల పింఛన్లు అందిస్తూ రూ.64వేల కోట్లు ఈ పథకానికి ఖర్చు పెడుతున్నామని చెప్పారు. ఇచ్చిన ప్రతీ హామీని ప్రాధాన్యతా క్రమంలో అమలు చేస్తూ సంక్షేమానికి ఒకవైపు, అభివృద్ధికి మరోవైపు బాటలు వేస్తున్నామన్నారు. 2014-19 టీడీపీ పాలన స్వర్ణయుగం కాగా, 2019-24 వైసీపీ పాలన విధ్వంసం, కక్షలతో సాగిందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబునాయుడు అభివృద్ధి పథంలో నిలుపుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి 24 నెలలు పూర్తయిందని, రూ.24లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురాగా, వైసీపీ ఐదేళ్ల కాలంలో పరిశ్రమలు పారిపోయేలా జగన్‌రెడ్డి చేశారని ఆరోపించారు. జిల్లాకు నేరడి బ్యారేజ్ ముఖ్యమని, దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా మూడు పంటలు పండించుకునేందుకు, నిరంతరాయంగా సాగునీరు అందుతుందన్నారు. దీనికి సంబంధించి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవతో ఒడిశా, ఆంధ్రాకు ఉన్న వివాదాలను పరిష్కరించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రతీకార రాజకీయాలకు వెళ్లడం లేదన్నారు. తనను రెండుసార్లు రోజుల తరబడి జైలులో పెట్టి ఇబ్బందులు పెట్టారని, కానీ వాటి ప్రతీకారానికి అవకాశం ఇవ్వకుండా కేవలం అభివృద్ధిపై దృష్టి సారించానని తెలిపారు. 2029 ఎన్నికలు వచ్చే నాటికి ఏ ఒక్కరూ తనను బాగున్నారని పలకరించాలే తప్ప, పని కావాలని అడగకూడదన్నదే తన ముందున్న లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డీఆర్‌డీఏ పీడీ టి.కిరణ్‌కుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు పినకాన జోగారావు, పీఏసీఎస్ అధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్, నాయకులు ఎస్.జానకిరాం, ఎం.బాలకృష్ణ, జీరు నానీరెడ్డి, ముదిలి సింహాచలం, కె.సతీష్, జయరాం, పద్మావతి, మండల అధికారులు కుమార్ పట్నాయక్, మనోరత్నం, నాగరాజు తదితరులు ఉన్నారు.