Share News

కొత్త సిలబస్‌ వచ్చేసింది

ABN , Publish Date - May 29 , 2026 | 11:53 PM

Changes in government textbooks విద్యావ్యవస్థ బలోపేతం దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధన అందించేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఈ (2026-27) విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్యపుస్తకాల్లో సిలబస్‌ను మార్పు చేసింది.

కొత్త సిలబస్‌ వచ్చేసింది

  • ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో మార్పులు

  • ఆరో తరగతిలో ఏఐ పాఠాలు

  • విద్యార్థులు నీట్‌, ఐఐటీకి సిద్ధమయ్యేలా రూపకల్పన

  • నరసన్నపేట, మే 29(ఆంధ్రజ్యోతి): విద్యావ్యవస్థ బలోపేతం దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధన అందించేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఈ (2026-27) విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్యపుస్తకాల్లో సిలబస్‌ను మార్పు చేసింది. ఎన్‌సీఈఆర్‌టీ ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు కొత్త పుస్తకాలు వచ్చాయి. 9, 10వ తరగతి పుస్తకాల్లో 20 శాతం సిలబస్‌ మార్పు చేశారు. స్థానిక మహనీయుల చరిత్ర, ప్రధాన అంశాలతోపాటు చరిత్రను సులువుగా అర్థం చేసుకునే విధంగా మార్పులు చేపట్టారు. విద్యార్థులు నీట్‌, ఐఐటీలకు సిద్ధమయ్యేలా ఆరో తరగతి నుంచి సిలబస్‌ రూపొందించారు.

  • తగ్గిన బరువు

  • గతేడాది వరకు ప్రతీ తరగతికి ఎన్ని సబ్జెక్టులుంటే అన్ని పుస్తకాలు ఇచ్చేవారు. వీటితోపాటు నోట్‌పుస్తకాలు, కాపీరైటింగ్‌ పుస్తకాలతో స్కూల్‌ బ్యాగ్‌లు బరువుగా ఉండేవి. యాశ్‌పాల్‌ కమిటీ సిఫారసు మేరకు ఈ ఏడాది నుంచి స్కూల్‌ బ్యాగ్‌ బరువు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

  • ఒకటో తరగతిలో తెలుగు, ఇంగ్లీష్‌, గణితం మూడు సబ్జెక్టులు కలిపి ఒకే పుస్తకంలో ముద్రించారు

  • ఆరో తరగతిలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ సబ్జెక్టులను ఒకే పుస్తకంగా తీసుకువచ్చారు. దీంతో విద్యార్థులకు పుస్తకాల మోత కొంత మేరకు తగ్గనుంది. ప్రాథమిక విద్యలో చిన్నారులకు అర్థమయ్యేలా బొమ్మల రూపంలో పాఠ్యాంశాలు ఉన్నాయి.

  • ఉన్నత విద్యలో 6 నుంచి 10వ తరగతి వరకు పుస్తకాల్లో ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లీషు మీడియంలో పాఠాలు ముద్రించారు.

  • ఆరో తరగతిలో ఏఐ పాఠాలు

  • మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఏడాది ఆరోతరగతి నుంచి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థి దశ నుంచే బోధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య ప్రణాళికలు రూపొందించింది. ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) పాఠ్యంశాన్ని ఆరోతరగతి సాంఘీక శాస్త్రంలో చేర్చింది. ఏఐ అంటే ఏమిటీ? ఎలా పనిచేస్తుంది ? ఉపయోగాలేమిటీ? అనే అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరాలు పొందుపరిచింది. అలాగే సైన్స్‌పై విద్యార్థులు మరింత ఆకర్షితమయ్యేలా ప్రయోగాలను వివరణాత్మకంగా బొమ్మలతో పాఠ్యపుస్తకాల్లో ముద్రించింది.

  • అంతా సిద్ధం

  • జిల్లాలో 2,652 పాఠశాలలో గతేడాది 1,59,032 మంది విద్యార్థులు చదివారు. ఈ ఏడాది 1,74,935 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, కిట్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను మండల స్టాక్‌ కేంద్రాల్లో పాఠశాలలు వారీగా సిద్ధం చేశారు. జూన్‌ మొదటి వారంలో ఉపాధ్యాయులకు కూడా కొత్త సిలబస్‌పై, పాఠశాల నిర్వహణపై వృత్యంతర శిక్షణ ఇవ్వనున్నారు. ప్రాథమిక మోడల్‌ ప్రాథమిక పాఠశాలల్లో ఒక తరగతికి ఒక గది ఏర్పాటు చేసి ప్రత్యేక బోధనకు చర్యలు చేపట్టారు. 93 శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరాయని, జూన్‌ 12 నాటికి వీటిని పాఠశాలలకు పంపిణీ చేస్తామని డీఈవో ఏ.రవిబాబు తెలిపారు.

Updated Date - May 29 , 2026 | 11:53 PM