‘మురసు’ ముప్పు
ABN , Publish Date - Nov 03 , 2026 | 12:10 AM
Rain due to the impact of a cyclone అర్నబ్ తుఫాన్ దెబ్బ నుంచి కోలుకోకముందే రైతులపై మరో తుఫాన్ ముప్పు ముంచుకొచ్చింది. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో సుమారు 21,519 హెక్టార్లలో వరి పంట నీటమునిగింది. పొలాల్లో వర్షపునీటిని మళ్లించి.. పంటను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు.
తుఫాన్ ప్రభావంతో వర్షం
ముంపునకు గురైన వరిపంట
ఆందోళనలో అన్నదాతలు
టెక్కలి రూరల్/ నరసన్నపేట/ అరసవల్లి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్ దెబ్బ నుంచి కోలుకోకముందే రైతులపై మరో తుఫాన్ ముప్పు ముంచుకొచ్చింది. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో సుమారు 21,519 హెక్టార్లలో వరి పంట నీటమునిగింది. పొలాల్లో వర్షపునీటిని మళ్లించి.. పంటను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఈ సమయంలో తాజాగా ‘మురసు’ తుఫాన్ ప్రభావంతో సోమవారం వేకువజాము నుంచి వర్షం కురవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షానికి మళ్లీ పొలాల్లో నీరు చేరి.. వేలాది ఎకరాల్లో వరిపంట ముంపునకు గురైందని ఆవేదన చెందుతున్నారు. నరసన్నపేట మండలం కరగాం, టెక్కలి మండలం కొల్లివలస, జగన్నాథపురం, శ్రీకాకుళం మండలం వాడాడ, శ్యాంపాలెం తదితర గ్రామాల్లో వరిపంటకు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. జలుమూరు, పోలాకి మండలాల్లో తుంపర భూముల్లో వరదనీరు చేరడంతో అయోమయం చెందుతున్నారు. పంట కోత దశలో తుఫాన్ల రూపంలో తమకు ముప్పు వాటిల్లుతోందని ఆరోపిస్తున్నారు. వరిపనలు కుళ్లిపోతున్నాయని, కొన్నిచోట్ల ధాన్యం తడిచి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ జలమయం
శ్రీకాకుళంలో ఆర్టీసీ కాంప్లెక్స్ జలమయమైంది. సోమవారం ఉదయం భారీ వర్షం కురవడంతో కాంప్లెక్స్ ప్రాంగణమంతా వరదనీరు నిలిచిపోయింది. ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. అలాగే నగరంలోని పలు కాలనీల్లో రోడ్లపై, పార్కుల్లో వర్షపునీరు నిలిచిపోవడంతో అవస్థలు పడ్డారు.